India - Myanmar: మయన్మార్‌ సరిహద్దుల్లో కంచె.. రూ.30,000 కోట్ల ఖర్చు..!

India - Myanmar: భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లో 1600 కిలోమీటర్ల కంచె నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.30వేల కోట్లు వెచ్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Published : 27 Mar 2024 18:24 IST

దిల్లీ: సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్లు నిరోధించేందుకు భారత్‌-మయన్మార్‌ (India - Myanmar)ల మధ్య కంచె (Border Fencing)ను నిర్మించనున్నట్లు ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. అయితే, పటిష్ఠమైన కంచె నిర్మాణం కోసం కేంద్రం భారీగా వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సరిహద్దులో 1600 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్‌కు దాదాపు రూ.30వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.

ఈనెల ఆరంభంలో ప్రభుత్వ కమిటీ కంచె నిర్మాణం కోసం బడ్జెట్‌ అంచనాలను ఆమోదించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. దీనికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ ఆమోదించాల్సి ఉందని తెలిపాయి. సరిహద్దు పొడవునా ఫెన్సింగ్‌కు సమాంతరంగా రోడ్ల నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు సరిహద్దు నుంచి మిలిటరీ బేస్‌లను కలిపేలా రోడ్లను ఏర్పాటుచేయనున్నారు.

కేజ్రీవాల్‌ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు.. భారత్‌ తీవ్ర అభ్యంతరం

ఈ మొత్తానికి కలిపి ఒక్కో కిలోమీటర్‌కు రూ.12 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. 2020లో బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన కంచె ఖర్చుతో పోలిస్తే ఇది రెట్టింపు అని తెలిపాయి. అయితే, దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఫెన్సింగ్‌ నిర్మాణంపై మయన్మార్‌ కూడా ఇంతవరకూ స్పందించలేదు.

ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపుర్‌, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లు మయన్మార్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇప్పటివరకు సరిహద్దు నుంచి ఇరువైపులా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. అయితే, ఇటీవల ఆ దేశం నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు పెరిగాయి. దీంతో వీటిని అరికట్టేందుకు సరిహద్దులో 1,643 కిలోమీటర్ల పొడవునా కంచె నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే మణిపుర్‌లోని మోరేలో 10 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసినట్లు అమిత్ షా వెల్లడించారు. హైబ్రిడ్‌ నిఘా వ్యవస్థ ద్వారా మణిపుర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో కిలోమీటరు చొప్పున ఫెన్సింగ్‌ ఏర్పాటుకు పైలట్‌ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని