UNSC: ఐరాసపై ఒత్తిడి పెంచితేనే.. భారత్‌కు శాశ్వత సభ్యత్వం - జైశంకర్‌

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UNSC)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం తప్పకుండా లభిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్ పేర్కొన్నారు.

Published : 02 Apr 2024 17:52 IST

రాజ్‌కోట్‌: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UNSC)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించాలనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉందని, అది తప్పకుండా లభిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్ పేర్కొన్నారు. అయితే, ఇందుకోసం భారత్‌ మరింత కష్టపడాల్సి ఉందన్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన మేధావుల సదస్సులో మాట్లాడిన ఆయన యూఎన్‌ఎస్‌సీలో భారత్‌కు శాశ్వత చోటు లభించే అవకాశాలపై అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు.

‘‘దాదాపు 80 ఏళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి (United Nations) ఏర్పాటైంది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉండాలని చైనా, ఫ్రాన్స్‌, రష్యన్‌ ఫెడరేషన్‌, బ్రిటన్‌, అమెరికా దేశాలు అవే స్వయంగా నిర్ణయించుకున్నాయి. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా 50 స్వతంత్ర దేశాలు మాత్రమే ఉన్నాయి. కాలానుగుణంగా వాటి సంఖ్య 193కు పెరిగింది. కానీ, ఈ ఐదు దేశాలు మాత్రం నియంత్రణ మొత్తం వాటి చేతుల్లోనే ఉంచుకున్నాయి. దీన్ని మార్చేందుకు సమ్మతి ఇవ్వాలని వారిని అడగడం ఆశ్చర్యంగా ఉంది. కొందరు అంగీకరిస్తారు, మరికొందరు వెనక్కి వెళ్తారు. ఇలా ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది’’ అని    ఎస్‌.జైశంకర్‌ పేర్కొన్నారు.

కచ్చతీవు వ్యవహారం.. శ్రీలంక స్పందన ఏంటంటే!

‘‘ఐరాసలో మార్పులు జరగాలని, భారత్‌ శాశ్వత సభ్యత్వం పొందాలనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ భావన పెరగడాన్ని ఏటా చూస్తున్నా. తప్పకుండా భారత్‌కు సభ్యత్వం వస్తుంది. కఠోర కృషి లేకుండా దేన్నీ సాధించలేము. ఇందుకోసం మరింత కృషి చేయాల్సి ఉంది’’ అని విదేశాంగ మంత్రి అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను జపాన్‌, జర్మనీ, ఈజిప్టు దేశాలు ఐరాస ముందుంచాయని, ఇందులో పురోగతి ఉంటుందనే విశ్వాసం ఉందన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం, గాజా సంక్షోభాలకు సంబంధించి ఐరాసలో ప్రతిష్టంభన నెలకొందన్నారు. ఈక్రమంలో ఐరాసపై ఒత్తిడి తెస్తేనే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందే అవకాశాలు భారత్‌కు మరింత పెరుగుతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని