Rajouri encounter: రాజౌరీ ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాదులు నక్కింది ఇక్కడే!

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో జరిగిన ఎన్‌కౌంటర్ సమయంలో ఉగ్రవాదులు దాక్కొన్న గుహల ఫొటోలను ఇండియన్‌ ఆర్మీ విడుదల చేసింది.

Published : 24 Nov 2023 17:15 IST

రాజౌరీ: జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir) రాజౌరీ (Rajouri) జిల్లాలో రెండు రోజుల పాటు జరిగిన ఎన్‌కౌంటర్‌ సమయంలో ఉగ్రవాదులు దాక్కున్న చిన్నపాటి గుహల ఫొటోలను ఇండియన్‌ ఆర్మీ (Indian Army) విడుదల చేసింది. వాటిల్లోనే నక్కిన ఉగ్రవాదులు అదును చూసి.. భద్రతాదళాలపై కాల్పులు జరిపారని తెలిపింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన కాలాకోట్‌ అడవుల్లో ఇలాంటి ప్రదేశాలు చాలా ఉంటాయని, వాటిని గుర్తించడం కష్టమని పేర్కొంది. ఉగ్రవాది అందులో దాక్కున్నట్లు దగ్గరికి వెళ్లేంత వరకూ తెలియదని, వాళ్లకు మాత్రం చుట్టుపక్కల ఉన్నవారిని గుర్తించేందుకు వీలుంటుందని ఆర్మీ అధికారులు జాతీయ మీడియాకు వివరించారు. ఆ ఫొటోను పరిశీలిస్తే.. రెండు భారీ బండరాళ్ల మధ్య ఓ చిన్న ఖాళీలో కేవలం ఒక్కరు మాత్రమే కూర్చునేందుకు వీలుండేలా ఉంది. ఆ గుహకు ముందు కూడా మరో చిన్నపాటి రాయి ఉంది. ఒకవేళ అటువైపుగా ఎవరైనా వచ్చినా.. ఆ రాయి చాటున దాక్కునేందుకు వీలుంది.

ఆగలేకపోయిన అమ్మ మనసు.. ఖైదీ బిడ్డకు మాతృత్వాన్ని పంచిన పోలీసమ్మ..!

ఇలాంటి ప్రదేశాల్లో దాక్కొని దాడి చేయడం వల్లనే ఇండియన్‌ ఆర్మీకి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. బుధ, గురువారం దాదాపు 36 గంటల పాటు సాగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే. ఇద్దరు యువకెప్టెన్లు ముగ్గురు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. కెప్టెన్‌ ఎంవీ ప్రంజల్‌ కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన వారు కాగా.. కెప్టెన్‌ శుభం గుప్తా ఉత్తర్‌ప్రదేశ్‌ ఆగ్రాకు చెందినవారు. హవల్దార్‌ అబ్దుల్‌ మాజిద్‌ స్వస్థలం జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లా అజోటే. లాన్స్‌నాయక్‌ సంజయ్‌ బిష్త్.. ఉత్తరాఖండ్‌లోని హల్లి పడ్లీ నుంచి, పారాట్రూపర్‌ సచిన్‌ లార్‌.. యూపీలోని అలీగఢ్‌ నుంచి వచ్చి సైన్యంలో చేరారు.

బాజిమాల్‌ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారం అందుకున్న సైనికాధికారులు, పోలీసులు ఈ ప్రాంతంలో ఆదివారం నుంచి వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. వాళ్ల కదలికలను పసిగట్టి.. ప్రజల్ని ఇళ్ల నుంచి బయటకు రావద్దని బుధవారం హెచ్చరించి, ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో వాళ్లు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదిని లష్కరే తోయిబా అగ్ర కమాండర్‌ క్వారీగా గుర్తించారు. క్వారీ గత ఏడాదిగా రాజౌరీ- పూంచ్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనీ, డాంగ్రీ, కాండీ దాడులకు అతడే సూత్రధారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని