Seized Ship: ఇరాన్‌ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..

Seized Ship: ఇరాన్‌ అదుపులో ఉన్న భారతీయ నౌకా సిబ్బందిలో కేరళ మహిళను విడుదల చేశారు. దీంతో ఆమె నేడు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు.

Published : 18 Apr 2024 17:12 IST

దిల్లీ: ఇజ్రాయెల్‌ (Israel)తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌక (Ship)ను ఇరాన్‌ (Iran) స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. పర్షియన్‌ గల్ఫ్‌లో నియంత్రణలోకి తీసుకున్న ఈ నౌకలో 17 మంది భారతీయ సిబ్బంది (Indian Crew) ఇంకా టెహ్రాన్‌ అదుపులోనే ఉన్నారు. వారిలో ఒకరైన కేరళ (Kerala) యువతిని ఇరాన్‌ విడిచిపెట్టింది. దీంతో ఆమె గురువారం క్షేమంగా స్వదేశానికి తిరిగొచ్చారు.

‘‘నౌక స్వాధీనం వ్యవహారంపై ఇరాన్‌ ప్రభుత్వంతో అక్కడి భారతీయ దౌత్య కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరిపింది. దీంతో సిబ్బందిలో ఒకరైన డెక్‌ క్యాడెట్‌ అంటెస్సా జోసెఫ్‌ను విడుదల చేశారు. కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన ఈమె నేడు కొచ్చిన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. మిగతా 16 మందితో ఎంబసీ అధికారులు టచ్‌లోనే ఉన్నారని తెలిపారు.  వారు ఆరోగ్యంగానే ఉన్నారని, భారత్‌లోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నారని చెప్పారు. మిగతా సిబ్బంది విడుదల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!

ఏప్రిల్‌ 13న హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్‌ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. అందులో 17 మంది భారతీయులు. ఈక్రమంలోనే వారిని విడిపించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ గత ఆదివారం ఇరాన్‌ విదేశాంగశాఖ మంత్రి హుసేన్‌ అమీర్‌ అబ్దుల్లాహియాన్‌తో మాట్లాడారు. ఆయన అభ్యర్థన మేరకు మన సిబ్బందిని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు కలిసేందుకు అనుమతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని