Bullet train: తొలి బుల్లెట్‌ రైలు.. ఆగస్టు 2026 నాటికి 50కి.మీ సిద్ధం!

అహ్మదాబాద్‌-ముంబయి మధ్య అందుబాటులోకి రానున్న బుల్లెట్‌ రైలులో కొంతభాగం ఆగస్టు 2026 నాటికి సిద్ధం కానుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

Published : 29 Nov 2023 21:24 IST

దిల్లీ: భారత్‌లో బుల్లెట్‌ రైలు (Bullet Train) ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో కొంతభాగం ఆగస్టు 2026 నాటికి పూర్తవుతుందన్నారు. గుజరాత్‌లోని సూరత్‌ (Surat) నుంచి బిలిమోరా వరకు 50కి.మీ దూరం సిద్ధం అవుతుందన్నారు.

కొవిడ్‌ ముందుతో పోలిస్తే కొత్త రైళ్ల సంఖ్యను పెంచామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. 1768 మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల సంఖ్యను 2124కు, సబర్బన్‌ సర్వీసులను 5626 నుంచి 5774 వరకు పెంచామన్నారు. ప్యాసింజర్‌ రైళ్ల సంఖ్య 2792 ఉండగా ప్రస్తుతం 2856కు పెరిగిందన్నారు. ఇక ట్రాక్‌లపై ప్రమాదాలను నిరోధించేందుకు కవచ్‌ వ్యవస్థ, ఏనుగుల నిరోధానికి గజ్‌రాజ్‌ వ్యవస్థతోపాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో అదనపు ట్రాక్‌ల ఏర్పాటుపై  ఉన్నతాధికారులతో జరిపిన సమావేశంలో చర్చించామన్నారు.

భార్యాభర్తల గొడవతో.. విమానం దారి మళ్లింది..!

దేశంలోనే తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు అహ్మదాబాద్‌-ముంబయి మధ్య పనులు ఊపందుకున్నాయి. ఈ రైలు కారిడార్‌ పొడవు 508.17 కిలోమీటర్లు. ఇప్పటికే 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం జరిగిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఇటీవలే వెల్లడించారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్‌ నుంచి ముంబయి చేరుకోవచ్చు. బుల్లెట్‌ ట్రైన్‌ తొలి ప్రయోగాత్మక పరుగును 2026లో చేపట్టేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని