IPS: ‘12th ఫెయిల్‌’.. ఆ రియల్‌ హీరోకు ఉత్తమ సేవా పతకం

ఐపీఎస్‌ అధికారి ‘మనోజ్‌ కుమార్‌ శర్మ’ (IPS Manoj Kumar Sharma) నిజజీవిత ఆధారంగా హిందీలో వచ్చిన ‘12th Fail’ సినిమా ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆ అధికారికి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పతకాన్ని (Service Medal) ప్రకటించింది.

Published : 26 Jan 2024 02:46 IST

దిల్లీ: ఐపీఎస్‌ అధికారి ‘మనోజ్‌ కుమార్‌ శర్మ’ (IPS Manoj Kumar Sharma) నిజజీవిత ఆధారంగా బాలీవుడ్‌లో ‘12th Fail’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ అధికారి రియల్‌ లైఫ్‌లోనూ హీరోగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఉత్తమ సేవా పతకాన్ని (Service Medal) ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులు స్వీకరించనున్న 37 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిలో ఆయన ఒకరు కావడం విశేషం.

మనోజ్‌ కుమార్‌ శర్మ 2005 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. మహారాష్ట్ర కేడర్‌కు చెందినవారు. ఈయన భార్య శ్రద్ధా జోషి (Shraddha Joshi) ఐఆర్‌ఎస్‌ అధికారి. మధ్యప్రదేశ్‌లోని ఓ చిన్న గ్రామానికి చెందిన శర్మ.. బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. సరైన విద్యా వసతులు లేని కారణంగా 12వ తరగతి ఫెయిల్‌ అయ్యారట. అయినప్పటికీ ఐపీఎస్‌ సాధించాలనే లక్ష్యంతో డిగ్రీ పొట్టాపొందిన ఆయన.. యూపీఎస్సీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వరుసగా మూడుసార్లు విఫలమై చివరికి తన లక్ష్యాన్ని సాధించారు. ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రద్ధాను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమ కథను శర్మ స్నేహితుడు అనురాగ్‌ పాఠక్‌ నవలగా మలిచారు. అదెంతో ప్రాచుర్యం పొందింది. దీని ఆధారంగా విధు వినోద్‌ చోప్రా దర్శకత్వంలో వచ్చిన 12th Fail సినిమా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.

క్యాన్సర్‌ నయమవుతుందంటూ.. చిన్నారిని గంగలో ముంచడంతో..

శర్మ బ్యాచ్‌మేట్‌ అయిన మరో అధికారి జితేందర్‌ రాణా సేవా పతకానికి ఎంపికయ్యారు. బిహార్‌ కేడర్‌కు చెందిన రాణాతో పాటు మనోజ్‌ కుమార్‌ శర్మలు డిప్యుటేషన్‌పై సీఐఎస్‌ఎఫ్‌ విభాగంలో సేవలందిస్తున్నారు. ముంబయి, దిల్లీ ఎయిర్‌పోర్టుల చీఫ్‌ ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఆఫీసర్లుగా (CASO) విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి సేవలకు గానూ ఉత్తమ సేవా పతకం వరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని