నవీన్‌ పట్నాయక్‌ ‘ఆరోగ్యంపై కుట్ర’?.. ప్రధాని మోదీ అనుమానాలు!

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ (Naveen Patnaik) ఆరోగ్యం క్షీణించడం వెనక ఏదైనా కుట్ర ఉందా? అని ప్రధాని మోదీ (Narendra Modi) అనుమానం వ్యక్తంచేశారు.

Published : 29 May 2024 19:35 IST

బారిపదా (ఒడిశా): ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ (Naveen Patnaik) ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వస్తోన్న వార్తలపై ప్రధాని మోదీ (Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. దాని వెనక ఏదైనా కుట్ర ఉందా? అన్న అనుమానాలు వ్యక్తంచేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే.. సీఎం ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలను తేల్చేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఒడిశాలోని బారిపదాలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన మోదీ.. ఐదు దశాబ్దాల తర్వాత కేంద్రంలో వరుసగా మూడోసారి పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నామని అన్నారు.

‘‘నవీన్‌ పట్నాయక్‌ ఆరోగ్యం క్షీణంచడం వెనక ఏదైనా కుట్ర ఉందా? ఆయన తరఫున ప్రభుత్వాన్ని నడుపుతోన్న లాబీనే ముఖ్యమంత్రి ఆరోగ్యం క్షీణించడానికి కారణమా? ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తే.. పట్నాయక్‌ ఆరోగ్యం క్షీణించడానికి గల కారణాలను అన్వేషించేందుకు కమిటీని ఏర్పాటుచేస్తాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి కదలికలను కూడా సీఎం సన్నిహితుడు పాండియన్‌ నియంత్రిస్తున్నాడంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించిన మరుసటిరోజే ప్రధాని ఈవిధంగా స్పందించారు.

బాగానే ఉన్నా.. నా ఆరోగ్యంపై భాజపా అబద్ధాలు చెబుతోంది: నవీన్‌ పట్నాయక్‌

పట్నాయక్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న బీజేడీ నేత వీకే పాండియన్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడిన మోదీ.. ‘‘ఒడిశా మొత్తం ఒడియా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటోంది. 25 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలిస్తోన్న బీజేడీకి ముగింపు పలకాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు’’ అని అన్నారు. తమిళనాడుకు చెందిన పాండియన్‌.. పంజాబ్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఒడిశా మహిళను వివాహం చేసుకున్న ఆయన.. అక్కడికే మకాం మార్చాడు. అందుకే ఆయన్ను బయట వ్యక్తి అని పేర్కొంటూ భాజపా ప్రచారం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని