Congress: కాంగ్రెస్‌కు మళ్లీ షాక్‌.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు

Congress: కాంగ్రెస్‌కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది.

Updated : 29 Mar 2024 14:03 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదాయపు పన్ను (Income Tax) అంశంలో కాంగ్రెస్‌ (Congress)కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ పార్టీకి ఐటీ విభాగం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత వివేక్‌ తంఖా శుక్రవారం వెల్లడించారు. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1823 కోట్ల డిమాండ్‌ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. తమపై ఐటీ విభాగం ప్రక్రియను నిలిపివేయాలంటూ పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన వెంటనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

ఎలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే గురువారం తాజా నోటీసులిచ్చినట్లు వివేక్‌ తంఖా ఆరోపించారు. ఇది అహేతుక, అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. దీన్ని తాము చట్టపరంగా సవాల్‌ చేస్తామని పేర్కొన్నారు.

కేజ్రీవాల్‌ పాస్‌వర్డులు చెప్పలేదు

2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. మదింపు ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన ఆధారాలు ఐటీ అధికారుల దగ్గర ఉన్నాయని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతకుముందు 2014-15 నుంచి 2016-17 మధ్య కాలానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన పునఃపరిశీలనను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కూడా ఇవే కారణాలతో దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ పునఃపరిశీలనకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాల నుంచి రూ.135 కోట్లను ఐటీ విభాగం రికవరీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని