రాజస్థాన్‌ ఎన్నికల వేళ.. ప్రైవేటు లాకర్లలో బయటపడుతున్న నోట్ల కట్టలు..!

రాజస్థాన్‌లో కొద్దిరోజుల క్రితం భాజపా ఎంపీ చేసిన ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆయన ఆరోపణలకు తగ్గట్టే ప్రైవేటు లాకర్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి.

Published : 10 Nov 2023 18:53 IST

జైపుర్‌: రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌ (Jaipur)లో ఉన్న ఓ భవనంలోని ప్రైవేటు లాకర్లలో రూ.500 కోట్ల నల్లధనంతో పాటు 50 కిలోల బంగారం దాచి ఉంచినట్లు భాజపా నేత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జైపుర్‌లోని గణపతి ప్లాజా (Ganpati Plaza)లో ఆదాయపన్ను విభాగం సోదాలు నిర్వహించింది. ఆ ప్లాజాలోని ప్రైవేటు లాకర్ల నుంచి లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.

రాజస్థాన్‌ (Rajasthan) అసెంబ్లీ ఎన్నికల వేళ కొద్దిరోజుల క్రితం భాజపా రాజ్యసభ సభ్యుడు కిరోడి లాల్‌ మీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్‌ లీకేజీ కుంభకోణానికి చెందిన వందల కోట్ల అక్రమ సంపాదనను గణపతి ప్లాజాలో దాచినట్లు ఆరోపించారు. పోలీసులు వచ్చి వాటిని తెరవాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే, ఆ లాకర్లు ఎవరికి చెందినవనే వివరాలను మాత్రం ఆయన బయటపెట్టలేదు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 17న దర్యాప్తు సంస్థ మూడు లాకర్లు తెరిచి రూ.30 లక్షలు స్వాధీనం చేసుకుంది. అక్టోబర్ 21న రూ.2.46 కోట్లను గుర్తించింది. ఇప్పటివరకు రూ.7 కోట్లు, 12 కేజీల బంగారాన్ని లాకర్ల నుంచి స్వాధీనం చేసుకుంది. అక్కడ మొత్తం 1,100 లాకర్లు ఉన్నాయి. తాజాగా మరికొన్ని లాకర్లలో తనిఖీలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఒక లాకర్‌ నుంచి లెక్కల్లో చూపని రూ.7.5 లక్షలను సీజ్‌ చేశారు. ఇంకా కౌంటింగ్ జరుగుతోందని మీడియా కథనాలు వెల్లడించాయి.

చెత్తకుప్పలో లభ్యమైన ఆ రూ.25 కోట్లు నకిలీవేనట!

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పేపర్‌ లీకేజీ కుంభకోణం విషయంలో భాజపా రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. మరోపక్క పలు కేసుల్లో రాష్ట్రంలోని కీలక నేతలకు ఈడీ సమన్లు ఇస్తోంది. వారికి సంబంధించిన ప్రాంతాల్లో వరుసగా తనిఖీలు చేపడుతోంది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. రాజస్థాన్‌లో నవంబర్ 25న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్‌ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని