Bengaluru: చెత్తకుప్పలో లభ్యమైన ఆ రూ.25 కోట్లు నకిలీవేనట!

బెంగళూరులో ఓ చెత్తకుప్పలో లభ్యమైన రూ.25 కోట్ల విలువైన అమెరికన్‌ కరెన్సీ నోట్లు నకిలీవేనని పోలీసులు వెల్లడించారు.

Published : 10 Nov 2023 14:58 IST

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) శివారులో చెత్త ఏరుకునే వ్యక్తికి అక్కడి ఓ చెత్తకుప్పలో రూ.25 కోట్ల విలువైన అమెరికన్‌ డాలర్లు లభ్యమైన విషయం తెలిసిందే. అయితే, వాటిని క్షుణ్నంగా పరిశీలించగా ఆ నోట్లు (US Dollars) నకిలీవి (Fake Notes)గా తేలాయట. పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. వాటిని రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI)కు పంపగా.. ఆ నోట్లు ఫొటోకాపీ, లేదా ప్రింట్‌ తీసినవిగా అధికారులు తెలిపారన్నారు.

సల్మాన్‌ షేక్‌ అనే వ్యక్తి ఇటీవల బెంగళూరు శివారులో చెత్త ఏరుకుంటుండగా అమెరికన్‌ డాలర్ల కట్టలు 23 కనిపించాయి. అతడి యజమాని, అక్కడి నుంచి ఓ సామాజిక కార్యకర్త ద్వారా ఈ వ్యవహారం బెంగళూరు పోలీసుల వద్దకు చేరింది. ఈ మొత్తం విలువ రూ.25 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ నోట్లపై కొన్ని రకాల రసాయనాలను పూసినట్లు గుర్తించారు. బ్లాక్‌ డాలర్‌ స్కామ్‌కు పాల్పడుతున్న ముఠాకి చెందిన వారు ఈ కరెన్సీ నోట్లను అక్కడ వదిలేసి వెళ్లిపోయి ఉంటారని అనుమానించారు.

చెత్తకుప్పలో రూ.25 కోట్లు..!

డబ్బుతోపాటు ఐరాస ముద్రతో కూడిన ఓ లేఖ కూడా షేక్‌కు లభించింది. ‘దక్షిణ సూడాన్‌లోని ఐరాస శాంతి పరిరక్షక దళాలకు సాయం కోసం ఐరాస భద్రతామండలి ఆమోదంతో ఎకనామిక్‌, ఫైనాన్సియల్‌ కమిటీ ప్రకటించిన ప్రత్యేక నిధి’ అని రాసి ఉంది. ఈ క్రమంలోనే అవి నిజమైన డాలర్లేనా? నకిలీవా? అని గుర్తించేందుకు వాటిని ఆర్బీఐకు పంపగా.. చివరకు నకిలీవిగా తేలాయి. మరిన్ని వివరాల కోసం వాటిని చెన్నైలోని ఓ ప్రైవేటు బ్యాంకుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.  ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని