Election Commission: 35 ఏళ్లలో అత్యధిక ఓటింగ్‌.. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకూ సంసిద్ధం: సీఈసీ

లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌లో గత 35 ఏళ్లలోనే అత్యధిక పోలింగ్‌ శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Published : 27 May 2024 19:57 IST

దిల్లీ: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లో గత 35 ఏళ్లలో అత్యధిక పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. 5 లోక్‌సభ స్థానాల్లో కలిపి 58.46 శాతం ఓట్లు పోలయ్యాయని తెలిపింది. 2019తో పోలిస్తే కశ్మీర్‌ లోయలో ఏకంగా 30 శాతం ఓటింగ్‌ పెరిగినట్లు, అభ్యర్థుల సంఖ్యలో కూడా 25 శాతం పెరుగుదల నమోదైనట్లు చెప్పింది. ఓటర్ల నుంచి ఈ స్థాయిలో మద్దతు లభించడం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సానుకూల పరిణామమని భారత ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు.

కశ్మీర్ లోయలోని మూడు స్థానాల్లో కలిపి 50.86 శాతం ఓటింగ్ నమోదు కావడం.. ప్రజాస్వామ్య ప్రక్రియపై స్థానిక ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఎన్నికల సంఘం తెలిపింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 19.16 శాతం ఓట్లు నమోదు కాగా.. ఈసారి 30 శాతం పెరిగినట్లు వెల్లడించింది. కశ్మీర్‌ లోయలోని శ్రీనగర్‌లో 38.49, బారాముల్లాలో 59.1, అనంత్‌నాగ్‌-రాజౌరీలో 54.84 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ మూడుచోట్ల గత మూడు దశాబ్దాల్లో ఇవే అత్యధికం. జమ్మూ ప్రాంతంలోని ఉధంపుర్‌లో 68.27, జమ్మూలో 72.22 శాతం పోలింగ్‌ నమోదైంది.

జమ్మూకశ్మీర్‌ విషయంలో మా తదుపరి లక్ష్యం అదే: అమిత్‌ షా

లోక్‌సభ ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటింగ్‌ నమోదుకావడాన్ని ప్రస్తావించిన సీఈసీ రాజీవ్‌కుమార్‌.. స్థానికంగా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియనూ అతి త్వరలో ప్రారంభిస్తామని శనివారం పేర్కొన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30లోగా ఇక్కడ శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని గత ఏడాది ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘ఆర్టికల్‌ 370’ రద్దు, జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరగనున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం.. ఇక్కడ శాసనసభ స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది. ఒక ఎంపీ స్థానం ఉన్న లద్ధాఖ్‌లో అసెంబ్లీ నిబంధనేదీ లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు