దివ్యాంగుడని కూడా కనికరించలేదు.. నీళ్లు అడిగాడని చితకబాదారు..

నీళ్లు అడిగాడనే కారణంతో ఓ దివ్యాంగుడిని ఇద్దరు గస్తీ సిబ్బంది చావబాదారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు వారిద్దర్నీ విధుల నుంచి తొలగించారు.

Published : 30 Jul 2023 16:02 IST

డియోరియా: కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతనందించాల్సిన భద్రతాసిబ్బంది విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. నీళ్లు అడిగాడనే కారణంతో దివ్యాంగుడని కూడా చూడకుండా సచిన్‌ సింగ్‌ అనే వ్యక్తిని ఇద్దరు  ప్రాంతీయ రక్షక్‌ దళ్‌ (PRD) జవాన్లు చావబాదారు. ఈ ఘటన శనివారం రాత్రి ఉత్తర్‌ప్రదేశ్‌లోని డియోరియాలో చోటు చేసుకుంది. అక్కడికి సమీపంలో ఉన్న వ్యక్తి టెర్రస్‌పై నుంచి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కారకులపై చర్యలకు ఉపక్రమించారు. వారిద్దర్నీ విధుల నుంచి తప్పించారు. వివరాల్లోకి వెళ్తే.. 26 ఏళ్ల సచిన్‌ సింగ్‌ అనే వ్యక్తి 2016లో జరిగిన రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. సిమ్‌కార్డులు విక్రయిస్తూ, స్థానికంగా ఓ రెస్టారంట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

శనివారం రాత్రి భోజనం ముగించుకొని త్రిచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా.. ఓ గుడికి సమీపంలో సచిన్‌ సింగ్‌కు తాబేలు కనిపించింది. కిందకి దిగి దాన్ని గుడి బయట ఉన్న కొలనులో వదిలి తిరిగి వచ్చాడు. అక్కడ ఇద్దరు ప్రాంతీయ రక్షక్‌ దళ్‌ (పీఆర్‌డీ) సిబ్బందిని చూసి.. చేతులు కడుక్కునేందుకు వారిని నీళ్లు అడిగాడు. అంతే.. వారిద్దరూ దుర్భాషలాడుతూ అతడిని చావగొట్టారు. ఆ జవాన్లను రాజేంద్ర మణి, అభిషేక్‌ సింగ్‌గా గుర్తించిన అధికారులు.. వారిద్దరినీ పూర్తిగా విధుల నుంచి తొలగించారు. పీఆర్‌డీతో ఇకపై వారిద్దరికీ ఎలాంటి సంబంధాలు ఉండబోవని ఎస్పీ సంకల్ప్‌శర్మ వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని