గంభీర్‌ బాటలో జయంత్‌ సిన్హా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరం

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భాజపా ఎంపీ జయంత్‌ సిన్హా నిర్ణయానికొచ్చారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.

Published : 02 Mar 2024 16:40 IST

దిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ జయంత్‌ సిన్హా (Jayant Sinha) పేర్కొన్నారు. ప్రత్యక్ష ఎన్నికల బాధ్యతల నుంచి తనను తప్పించాలని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు. ఈవిషయాన్ని ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. తూర్పు దిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించిన కాసేపటికే జయంత్‌ సిన్హా కూడా అదేతరహా ప్రకటన చేయడం గమనార్హం.

రాబోయే సార్వత్రిక ఎన్నికలకు భాజపా తొలి జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది. ఈసారి కొందరు కొత్తవారికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. కొందరు సిట్టింగులకు పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. ఈక్రమంలోనే క్రికెట్‌ బాధ్యతలు ఉన్నందున తనను పోటీ నుంచి తప్పించాలని గౌతమ్‌ గంభీర్‌ పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఝార్ఖండ్‌లోని మహజారీబాగ్ ఎంపీగా వ్యవహరిస్తున్న జయంత్ సైతం తాను పోటీకి దూరమని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటానని స్పష్టంచేశారు. పర్యావరణ మార్పుల అంశంపై దృష్టి కేంద్రీకరించేందుకు సమయం వెచ్చిస్తానని తెలిపారు. పదేళ్ల పాటు హజారీబాగ్‌ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి, అమిత్‌ షాకు ధన్యవాదాలు తెలియజేశారు. జయంత్‌ సిన్హా కేంద్ర మంత్రిగానూ సేవలందించారు.

భాజపా తొలి జాబితాలో.. కంగనా రనౌత్, అక్షయ్‌ కుమార్‌..?

ఆప్‌ విసుర్లు

తూర్పు దిల్లీ నుంచి గౌతమ్‌ గంభీర్‌ పోటీ నుంచి తప్పుకోవడంపై ఆమ్‌ఆద్మీ పార్టీ భాజపాపై విమర్శలు గుప్పించింది. ప్రజల కోసం పనిచేయాలన్న తపన, వారి అర్హతలు చూడకుండా   ఆ పార్టీ పోటీలో నిలుపుతోందని దుయ్యబట్టింది. ఈమేరకు పార్టీ సీనియర్‌ నేత అతిషి విలేకరులతో మాట్లాడారు. ఈ ఐదేళ్లలో తూర్పు దిల్లీ వాసులకు గంభీర్‌ చేసిందేమీ లేదని విమర్శించారు. ఆ పార్టీ ఎంపీలెవరూ నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదని ఆరోపించారు. ఆ పార్టీ ఎంపీలే కాదు ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు కూడా నియోజకవర్గంలో కనిపించడం లేదన్నారు. ఆప్‌ ఎమ్మెల్యేలు మాత్రం నిత్యం ప్రజల్లో ఉంటారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు