Kangana Ranaut: అత్యాచారాలు, హత్యలు జరిగినా మీకు ఫర్వాలేదా?: కంగనా ఆగ్రహం

Kangana Ranaut: విమానాశ్రయంలో తనకు జరిగిన చేదు అనుభవంపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి స్పందించారు. అత్యాచారాలు, హత్యలు జరిగినా.. కారణం కరెక్టేనంటూ వాటికి పాల్పడిన నేరస్థులను సమర్థిస్తారా? అంటూ నిలదీశారు.

Published : 08 Jun 2024 13:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌ (Kangana Ranaut)ను చండీగఢ్‌ విమానాశ్రయంలో ఓ సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ చెంపదెబ్బ కొట్టిన ఘటన (Slap Incident) కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెకు మద్దతుగా నిలవగా.. మరికొందరేమో కానిస్టేబుల్‌ చర్యను సమర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి ఘటనపై మరోసారి స్పందించిన కంగనా.. ఎక్స్‌ వేదికగా సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. ‘ఇక అత్యాచారాలు, హత్యలు జరిగినా మీకేం ఫర్వాలేదా?’ అంటూ కానిస్టేబుల్‌కు మద్దతిచ్చిన వారిని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘అత్యాచారానికి పాల్పడినవాడు.. హంతకుడు.. దొంగ.. ఇలా నేరం చేసినవారు ఎవరైనా భావోద్వేగ, మానసిక, ఆర్థికపరమైన కారణాలు చెబుతుంటారు. కారణం లేకుండా ఏ నేరం జరగదు. అయినా సరే చేసిన నేరానికి వారిని దోషిగా తేల్చి శిక్ష విధిస్తారు. అలా కాదని చట్టాన్ని ఉల్లంఘించి నేరాలకు పాల్పడిన క్రిమినల్స్‌ భావోద్వేగాలకు విలువిస్తే.. అనుమతి లేకుండా ఓ వ్యక్తి శరీరాన్ని తాకడం, వారిపై దాడి చేయడం వంటి ఘటనలను మీరు సమర్థిస్తే.. అత్యాచారాలు, హత్యల వంటివి జరిగినా మీకేం ఫర్వాలేదనే అర్థం. మీలాంటివారు మీ మానసిక పరిస్థితిపై మరింత దృష్టిపెట్టుకోవాలి. యోగా, ధ్యానం చేయండి. లేదంటే జీవితం చేదు అనుభవంగా మారుతుంది. పగ, ద్వేషం, అసూయతో ఉండకండి. వాటినుంచి ఇకనైనా విముక్తి పొందండి’’ అని కంగనా (Kangana Ranaut) రాసుకొచ్చారు.

గత గురువారం దిల్లీ విమానాశ్రయంలో కంగనకు ఈ చేదు అనుభవం ఎదురైంది. భద్రతా తనిఖీ చేసుకొని ముందుకువెళుతున్న కంగనను అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ (CISF Women Constable) కుల్విందర్‌ కౌర్‌ చెంపపై కొట్టారు. దీంతో భద్రతా అధికారులు కంగన చుట్టూ వలయంగా ఏర్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో గతంలో ఆందోళన నిర్వహించిన మహిళా రైతుల విషయంలో కంగన అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే కొట్టానని ఆ కానిస్టేబుల్‌ చెప్పారు. ఈ ఘటనపై బాలీవుడ్‌ ప్రముఖులు స్పందించకపోవడంపై కంగనా ఆగ్రహం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు