జేడీయూ డిమాండ్లు షురూ.. ‘అగ్నిపథ్‌’ను సమీక్షించాలన్న నీతీశ్‌ పార్టీ

ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి కాబోతున్న నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ.. అగ్నిపథ్‌ స్కీమ్‌ను సమీక్షించాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది.

Published : 06 Jun 2024 16:39 IST

Agnipath scheme | దిల్లీ: ఎన్నికల వేళ ఉత్తరాదిన బాగా చర్చకు వచ్చిన ప్రధానాంశాల్లో అగ్నిపథ్‌ స్కీమ్‌ (Agnipath scheme) ఒకటి. త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి మోదీ సర్కారు తీసుకొచ్చిన ఈ స్కీమ్‌పై అప్పట్లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల వేళ విపక్షాలు సైతం దీన్ని ప్రచార అస్త్రంగా వాడుకున్నాయి. ఇప్పుడు మూడోసారి తెదేపా, జేడీయూ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేయబోతున్న భాజపా సర్కారుకు నీతీశ్‌ పార్టీ (JDU) నుంచి అప్పుడే డిమాండ్లు మొదలయ్యాయి. అగ్నిపథ్‌ స్కీమ్‌ను సమీక్షించాలని ఆ పార్టీ సీనియర్‌ నేత కేసీ త్యాగి ఓ టీవీ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అగ్నిపథ్‌ స్కీమ్‌ గురించి పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని కేసీ త్యాగి అన్నారు. ఈ స్కీమ్‌ను చాలామంది వ్యతిరేకించారని, ఎన్నికల్లోనూ దాని ప్రభావం పడిందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంతో తాము ఘర్షణ పడాలనుకుకోవడం లేదని పేర్కొంటూనే.. ఈ స్కీమ్‌ను తీసుకొచ్చినప్పుడే సాయుధ దళాలకు చెందిన కుటుంబాలు వ్యతిరేకించిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల వేళ ఆయా కుటుంబాలు నిరసనలు తెలియజేశారని గుర్తు చేశారు. కాబట్టి దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని త్యాగి అన్నారు. దీంతో పాటు బిహార్‌కు ప్రత్యేక హోదా, దేశవ్యాప్త కులగణన వంటి అంశాలను తెరపైకి తెస్తోంది.

‘ఇకపై నాకంతా కష్టకాలమే’.. ఓటమిపై అధీర్‌ చౌధరి

డిఫెన్స్‌ బిల్లును తగ్గించుకునేందుకు కేంద్రం 2022లో అగ్నిపథ్‌ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌ అగ్నివీర్‌లుగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికైనవారు నాలుగేళ్లపాటు పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో 25 శాతం మంది మాత్రమే మరో 15 ఏళ్లు పని చేయడానికి అవకాశం లభిస్తుంది. ఈ స్కీమ్‌ తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ముందు ఓ సందర్భంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా అగ్నిపథ్‌ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. పథకంలో లోటుపాట్లుంటే సరిదిద్దుతామని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని