Kalpana Soren: గాండేయ్‌లో పోటాపోటీ.. కల్పనా సోరెన్‌ గట్టెక్కేనా!

హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌.. గాండేయ్‌ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేశారు. తాజా ఫలితాల్లో అధికార జేఎంఎం, భాజపా మధ్య పోటాపోటీ కొనసాగుతోంది.

Published : 04 Jun 2024 15:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ వైపు రాష్ట్రంలో సానుకూల పవనాలు వీస్తున్నట్లు కనిపిస్తోంది. హేమంత్‌ జైలుకెళ్లిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సతీమణి కల్పనా సోరెన్‌.. గాండేయ్‌ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేశారు. తాజా ఫలితాల్లో అధికార జేఎంఎం, ప్రతిపక్ష భాజపా మధ్య పోటాపోటీ కొనసాగుతోంది. నాలుగో రౌండ్‌ (మొత్తం 24 రౌండ్లు) పూర్తయ్యే సరికి 1148 ఓట్లతో కల్పనా ముందంజలో ఉండగా.. భాజపా నేత దిలీప్‌ కుమార్‌ వర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ అహ్మద్‌ రాజీనామాతో గాండేయ్‌ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతోంది.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తం 14 లోక్‌సభ స్థానాలకుగానూ భాజపా ఎనిమిది చోట్ల ఆధిక్యంలో కొనససాగుతోంది. 2019 ఎన్నికల్లో 11 స్థానాలను కైవసం చేసుకున్న భాజపా.. ఈసారి తన బలం కోల్పోయినట్లు కనిపిస్తోంది. అధికార జేఎంఎం మూడు, కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఏజేఎస్‌యూ మరో స్థానంలో గెలుపు దిశగా కొనసాగుతున్నాయి. గతంలో ఈ మూడు పార్టీలు ఒక్కో స్థానానికే పరిమితమయ్యాయి.

ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను మనీలాండరింగ్‌ కేసులో జనవరి 31న ఈడీ అరెస్టు చేసింది. లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఆయన అరెస్టు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీంతో కల్పనా సోరెన్‌.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఉద్దేశపూర్వకంగానే హేమంత్‌ సోరెన్‌ను భాజపా అరెస్టు చేయించిందని ఆరోపించిన ఆమె.. విపక్ష కూటమి ‘ఇండియా’ తరఫున ముమ్మర ప్రచారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని