Narayana Murthy: ‘అభిమానులను కరీనా పట్టించుకోలేదు’: నారాయణ మూర్తి ఆసక్తికర వ్యాఖ్య

Narayana Murthy: బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఆమె అభిమానులను పట్టించుకోలేదని ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

Updated : 25 Jul 2023 12:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఖాన్‌ (Kareena Kapoor) గురించి ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) దంపతులు మాట్లాడిన ఆసక్తికర సంభాషణ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులను కరీనా అంతగా పట్టించుకోరని నారాయణ మూర్తి వ్యాఖ్యానించగా.. ఆ మాటలను ఆయన సతీమణి సుధామూర్తి (Sudha Murthy) వ్యతిరేకిస్తూ నటికి మద్దతుగా నిలిచారు. ఇంతకీ వీరిద్దరూ కరీనా గురించి ఏం మాట్లాడారంటే..

ఈ ఏడాది ఆరంభంలో నారాయణ మూర్తి (Narayana Murthy) దంపతులు ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సయమంలో ఇన్ఫీ కో-ఫౌండర్‌ మాట్లాడుతూ కరీనా ప్రస్తావన తీసుకొచ్చారు. ‘‘ఓసారి నేను లండన్‌ నుంచి వస్తుండగా విమానంలో నా పక్క సీట్లో నటి కరీనా కపూర్‌ (Kareena Kapoor) కూర్చున్నారు. ఆమెను చూసి చాలా మంది అక్కడకు వచ్చి నటిని పలకరించారు. కానీ, ఆమె కనీసం స్పందించలేదు. అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరైనా మనదగ్గరకు వచ్చి పలకరిస్తే లేచి నిల్చుని నిమిషమో, అర నిమిషమో మాట్లాడుతాం. మననుంచి వాళ్లు కోరుకునేది కూడా అంతే’’ అని నారాయణ మూర్తి గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు.

అలియా భట్‌ గొప్ప నటి.. ఆ సినిమాలో ఆమె నటనకు కన్నీళ్లు వచ్చాయి: సుధామూర్తి

అయితే పక్కనే ఉన్న సతీమణి సుధామూర్తి (Sudha Murthy) ఆయన మాటలను అడ్డుకుంటూ.. ‘‘ఆమెకు కోట్ల మంది అభిమానులుంటారు. బహుశా ఆమె విసిగిపోయి ఉంటుంది. ఓ సాఫ్ట్‌వేర్‌ వ్యక్తి, కంపెనీ ఫౌండర్‌ అయిన నారాయణ మూర్తికి 10వేల మంది అభిమానులు ఉంటారేమో..! కానీ, సినీ నటికి కోట్ల మంది ఫ్యాన్స్‌ ఉంటారు కదా’’ అని అన్నారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వులు చిందించారు.

అనంతరం నారాయణ మూర్తి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ఇక్కడ సమస్య అది కాదు. ఎవరైనా మనపై అభిమానం చూపించినప్పుడు.. మనం ఆ ప్రేమను తిరిగి చూపించాలి. అది ఏ రూపంలోనైనా సరే.. తిరిగి చూపించడమే చాలా ముఖ్యం’’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా eoindia అనే డిజిటల్‌ క్రియేటర్ సంస్థ తమ ఇన్‌స్టా పేజీలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని