Borewell: బోరుబావిలో ఏడాదిన్నర చిన్నారి.. 20 గంటలు శ్రమించి రక్షించారిలా..!

Child fell in Borewell: బోరుబావిలో పడిన ఏడాదిన్నర చిన్నారి 20 గంటల తర్వాత మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Published : 04 Apr 2024 16:28 IST

విజయపుర: కర్ణాటక (Karnataka)లోని బోరుబావి (Borewell)లో పడిన ఏడాదిన్నర చిన్నారి కథ సుఖాంతమైంది. రెస్క్యూ సిబ్బంది 20 గంటలు శ్రమించి ఆ పసివాడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. విజయపుర జిల్లా ఇండి తాలూకా లచ్యాణా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ గ్రామానికి చెందిన సాక్షిత్‌ మజగొండన బుధవారం మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి తన ఇంటి సమీపంలోని తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయాడు. బావిలో నుంచి చిన్నారి ఏడుపు శబ్దాలు విన్న స్థానికులు వెంటనే కుటుంబసభ్యులకు చెప్పారు. సమాచారమందుకున్న ఎస్‌డీఆర్ఎఫ్‌, ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

బెంగళూరుపై అతి తక్కువ ఎత్తులో వీవీఐపీ భారీ విమానం..!

బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఈ రెస్క్యూ ఆపరేషన్‌ మొదలైంది. మొదట బోరుబావిలోకి కెమెరాను పంపగా.. 16 అడుగుల లోతులో చిన్నారి కాలు కదులుతూ కన్పించింది. వెంటనే పైప్‌లైన్‌ సాయంతో ఆక్సిజన్‌ను లోపలికి పంపించారు. ఆ తర్వాత బావి చుట్టూ తవ్వారు. దాదాపు 18 గంటల తర్వాత బాలుడి చిక్కుకొన్న ప్రాంతానికి రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారు.

అయితే చిన్నారి రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోవడంతో బయటకు తీసుకురావడం కష్టమైంది. మరో రెండు గంటలు శ్రమించి బండరాళ్లను తొలిచి చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నంతసేపు ఆ పసివాడు ఏడుస్తున్న దృశ్యాలు అక్కడి వారి హృదయాలను కలిచివేశాయి. చిన్నారి మృత్యుంజయుడిగా బయటపడటంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి అవసరమైన చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సహాయక చర్యలు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని