Siddaramaiah: కుమారుడి ‘వీడియో’పై వివాదం.. చిక్కుల్లో సీఎం సిద్ధరామయ్య!

కర్ణాటక ముఖ్యమంత్రి తనయుడు నగదు తీసుకొని అధికారులను బదిలీ చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపించాయి.

Published : 17 Nov 2023 01:59 IST

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కుమారుడి రూపంలో కొత్త చిక్కులు మొదలయ్యాయి. సీఎం కుమారుడు యతీంద్ర.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఫోన్‌లో సంభాషిస్తోన్న వీడియో వైరల్‌ కావడం తాజా వివాదానికి కారణమయ్యింది. నగదు తీసుకొని అధికారులను బదిలీ చేస్తున్నారంటూ విపక్ష పార్టీలు ఆరోపించాయి. సీఎం కుమారుడు ‘సూపర్‌ సీఎం’గా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టాయి. ఈ వ్యవహారంపై స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌.. అందులోని సంభాషణలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (CSR) కింద ఖర్చు చేసే నిధులకు సంబంధించినవి బదులిచ్చారు.

దళపతుల లౌకికవాదం గాలికే

ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో సీఎం సిద్ధరామయ్య కుమారుడు, మాజీ ఎమ్మెల్యే యతీంద్ర ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో వైరల్‌ అయ్యింది. ఓ జాబితాలోని కొన్ని పేర్లను ప్రస్తావిస్తూ.. మార్పులు చేయాలని అటువైపు వారిని సూచిస్తున్నట్లు అందులో ఉంది. అది అధికారుల బదిలీలకు సంబంధించినదేనని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. అందులో ఉన్నవారెవరు? వాటిపై దర్యాప్తు జరపాలని డిమాండు చేశారు. ఈ క్రమంలోనే స్పందించిన భాజపా.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కంటే ఈయనే (యతీంద్ర) కీలకశక్తిగా మారారని ఆరోపించింది. సీఎంగా సిద్ధరామయ్య స్థానం నామమాత్రమేనని.. పాలన మొత్తం కుమారుడి చేతుల్లోనే నడుస్తోందని విమర్శించింది.

ఆధారాలు చూపిస్తే వైదొలుగుతా: సీఎం

విపక్షాలు చేసిన ఆరోపణలను సిద్ధరామయ్య తిప్పికొట్టారు. సీఎస్‌ఆర్‌ నిధులతో పాఠశాల భవనాల నిర్మాణం గురించి యతీంద్ర తనతోనే మాట్లాడారని స్పష్టం చేశారు. దీనిపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. అధికారుల బదిలీకి చెందినదంటూ తప్పుగా చిత్రీకరించాయని మండిపడ్డారు. కరెంటు చౌర్యానికి పాల్పడిన కుమారస్వామి.. ప్రజల దృష్టి మరల్చేందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. డబ్బులు తీసుకొని అధికారులను బదిలీ చేసినట్లు ఆధారాలు చూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని అన్నారు. డిప్యూటీ సీఎం శివకుమార్‌ కూడా యతీంద్రకు మద్దతుగా నిలిచారు. కర్ణాటక డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం సభ్యుడిగా, ఆశ్రయ సమితి ఛైర్మన్‌గా ఉన్న యతీంద్ర.. సీఎస్‌ఆర్‌ నిధుల వినియోగంపైనే చర్చించారని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని