ED: చైనీయులకు వీసా కేసు.. ‘కార్తి చిదంబరం రూ.50 లక్షల లంచం తీసుకున్నారు’ : ఈడీ

చైనీయులకు అక్రమంగా వీసా అనుమతులు ఇచ్చిన కేసులో కార్తి చిదంబరం రూ.50లక్షలు అక్రమంగా స్వీకరించాడని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరోపించింది.

Published : 21 Mar 2024 17:23 IST

దిల్లీ: చైనీయులకు అక్రమంగా వీసా అనుమతులు ఇప్పించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తి చిదంబరంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఓ సన్నిహితుడి దగ్గర నుంచి రూ.50లక్షలను కార్తి అక్రమంగా స్వీకరించాడని ఆరోపించింది. ఇలా వచ్చిన నగదును ఆయన డైరెక్టర్‌గా ఉన్న ఓ కంపెనీలోకి మళ్లించినట్లు పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించి శివగంగా లోక్‌సభ స్థానం ఎంపీగా ఉన్న కార్తి చిదంబరంను పలుమార్లు విచారించిన ఈడీ.. ఆయన స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. ఇందుకు సంబంధించి ఇటీవల దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో కార్తితోపాటు ఆయన సన్నిహితుడు భాస్కరరామన్‌పై ఈ అభియోగాలు మోపింది. మార్చి 19న ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న దిల్లీలోని పీఎంఎల్‌ఏ న్యాయస్థానం.. ఏప్రిల్‌ 15న హాజరుకావాలంటూ కార్తితోపాటు ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది.

‘ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు ఇచ్చేశాం’: సుప్రీంలో ఎస్‌బీఐ అఫిడవిట్‌

భారీగా నగదు తీసుకొని చైనాకు చెందిన 250 మందికి వీసాలు ఇప్పించారన్నది కార్తి చిదంబరంపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఆయన తండ్రి పి.చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం జరిగిందని సీబీఐ వెల్లడించింది. దీనిపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. చిదంబరం సన్నిహితుడు, ఈ కేసుతో సంబంధం ఉన్న భాస్కరరామన్‌ను సీబీఐ ఇటీవల అరెస్టు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని