Arvind Kejriwal: మోదీకి రూ.1,000 కోట్లు ఇచ్చానంటే.. ఆయన్ను అరెస్టు చేస్తారా..?:కేజ్రీవాల్‌

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal).. భాజపా, దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తోన్న తీరును తీవ్రంగా విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. 

Updated : 15 Apr 2023 15:23 IST

దిల్లీ: మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సమన్లు జారీ చేయడంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal ) స్పందించారు. అవకతవకలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినా దర్యాప్తు సంస్థలు కోర్టుల్లో అబద్ధాలు చెప్తున్నాయని, అరెస్టు చేసినవారిని హింసిస్తున్నాయని కేజ్రీవాల్(Arvind Kejriwal ) ఆరోపించారు. శనివారం దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీ(Modi), భాజపా(BJP)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కేందుకు దర్యాప్తు సంస్థలను అసాధారణ స్థాయిలో వినియోగిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. 

‘‘కోర్టుకు సమర్పించే ప్రమాణ ప్రతాల్లో దర్యాప్తు సంస్థలు అబద్ధాలు వినిపిస్తున్నాయి. 14 ఫోన్లను ధ్వంసం చేశామని చెప్పాయి. చేయని నేరాన్ని అంగీకరించేలా అనుమానితులపై తీవ్ర బెదిరింపులకు దిగుతున్నాయి. ‘రేపు నీ కుమార్తె కళాశాలకు ఎలా వస్తుందో చూస్తా’ అంటూ బెదిరిస్తున్నాయి. వారు చెప్తున్న మద్యం పాలసీ నుంచి మనీశ్ సిసోదియా లబ్ధి పొందారంటున్నారు. నెలల తరబడి విచారణ జరుపుతున్నా ఇంతవరకూ ఎలాంటి అవకతవకలను గుర్తించలేదు. వారు సోదాల్లో ఎలాంటి సొమ్మును గుర్తించనప్పుడు.. గోవా ఎన్నికల ప్రచారంలో దానిని వినియోగించారని ఎలా చెప్పారు? దానికి ఆధారం ఏంటి..? మేం ప్రతి చెల్లింపును చెక్‌ రూపంలో చేశాం. ఎలాంటి ఆధారం లేకుండా సెప్టెంబర్ 17న రాత్రి ఏడు గంటల సమయంలో ప్రధాని మోదీకి నేను రూ.వెయ్యి కోట్లు ఇచ్చా అని చెప్తా. అప్పుడు మీరు ప్రధానిని అరెస్టు  చేస్తారా..?’ అని కేజ్రీవాల్‌(Arvind Kejriwal ) ఘాటుగా ప్రశ్నించారు.

‘ఈ మద్యం పాలసీనే పంజాబ్‌లో అమలు చేస్తున్నాం. దానివల్ల ఆదాయంలో 50 శాతం పెరుగుదల కనిపించింది. ఇది ఒక పారదర్శక, గేమ్‌ ఛేంజింగ్ పాలసీ’ అని కేజ్రీవాల్‌ అన్నారు. అలాగే తాను రేపు విచారణకు హాజరవుతానని చెప్పారు. ‘వారు నన్ను పిలిచారు. నేను తప్పక వెళ్తాను. కేజ్రీవాల్(Kejriwal) అవినీతిపరుడైతే.. ఈ ప్రపంచంలో నిజాయతీపరుడెవరూ ఉండరు. నన్ను అరెస్టు చేయాలని సీబీఐకి భాజపా ఆదేశాలు ఇస్తే.. సీబీఐ వాటిని తప్పకుండా పాటిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కోర్టుల్లో తప్పుడు ఆధారాలు సమర్పిస్తున్నందుకు సీబీఐ, ఈడీపై తగిన కేసులు పెడతామని ట్వీట్ చేశారు. 

మా ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు ఇవ్వడం లేదు : భాజపా

మద్యం విధాన కుంభకోణం(Delhi Liquor Scam)లో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలేనని తాము మొదటినుంచీ చెప్తున్నామంటూ సమన్ల అనంతరం భాజపా స్పందించింది. ఇప్పటికే ఆప్‌ అగ్రనేతలు మనీశ్‌ సిసోదియా(Manish Sisodia), సత్యేందర్ జైన్‌(Satyendar Jain) జైల్లో ఉండటాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. త్వరలో కేజ్రీవాల్‌(Arvind Kejriwal) జైల్లో వారితో చేరతారంటూ వ్యాఖ్యలు చేసింది. ‘మేము మిమ్మల్ని ఐదు ప్రశ్నలు అడిగాం. వాటికి మీరు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు. మీపై పాలిగ్రాఫ్, లై డిటెక్టర్ పరీక్ష ఎందుకు చేయించకూడదు..?’ అని భాజపా ప్రశ్నించింది. మరోవైపు.. ఒక కల్పిత మద్యం విధానం కింద కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి భాజపా కుట్ర పన్నుతోందని ఆప్‌ మండిపడింది. కమలం పార్టీ ఎన్ని పన్నాగాలు పన్నినా అవినీతికి వ్యతిరేకంగా తమ పోరాటం ఆగదని స్పష్టం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని