Kejriwal: రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. అలా చేస్తే..!: కేజ్రీవాల్‌

సీఎం పదవికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనంటూ అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. తాను అలా చేస్తే ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను అరెస్టు చేసేందుకు కేంద్రంలోని భాజపాకు అవకాశం ఇచ్చినట్లేనని అన్నారు. 

Published : 24 May 2024 00:13 IST

దిల్లీ: దిల్లీ (Delhi) మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ వ్యవహారంలో జైలుకు వెళ్లిన ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal).. మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, జైలు నుంచే పాలనా వ్యవహారాలు చేస్తున్నానని చెబుతున్న ఆయనను.. రాజీనామా చేయాలని భాజపా నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై దిల్లీ సీఎం స్పందించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని తేల్చి చెప్పారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాజపాపై మరోసారి విమర్శలు గుప్పించారు.

మురికివాడల్లో పని చేశా..

‘‘గతంలో ఇన్‌కమ్‌ టాక్స్‌ కమిషనర్‌ పదవిని వదులుకుని దిల్లీలోని మురికివాడల్లో పని చేశా. 2013లో ముఖ్యమంత్రి పీఠమెక్కిన 49 రోజుల్లోనే ఆ పదవికి రాజీనామా చేశా. నాడు ఎందుకు రాజీనామా చేశావని ఎవరూ అడగలేదు. చిన్న ఉద్యోగాన్ని కూడా ఎవరూ వదులుకోరు.. అలాంటిది సీఎం కుర్చీని కాదనుకున్నా. ప్రస్తుతం నేను ప్రజల కోసం పోరాడుతున్నా. అందుకే రాజీనామా చేయలేదు’’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

అలా చేస్తే.. వారి అరెస్టు తప్పదు

‘‘2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 67.. 2020లో 62 సీట్లను ఆప్‌ గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఆప్‌ను ఓడించలేమని భావించిన ప్రధాని మోదీ.. నన్ను అరెస్టు చేయించారు. తప్పుడు కేసులతో ఆప్‌ కీలక నేతలు మనీశ్‌ సిసోదియా, సంజయ్‌ సింగ్‌ సహా మరికొందరిని భాజపా అరెస్టు చేయించింది. ఈ కేసు (మద్యం కుంభకోణం) పెద్ద బూటకం. ఒకవేళ నేను రాజీనామా చేస్తే మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా అరెస్టు చేసే అవకాశం కేంద్రంలోని భాజపాకు ఇచ్చినట్లే అవుతుంది. తర్వాత బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కూడా అరెస్టు చేయవచ్చు. అందుకే రాజీనామా చేయను’’ అని సీఎం ఆరోపించారు.

లొంగిపో.. లేదంటే..! ప్రజ్వల్‌కు మాజీ ప్రధాని వార్నింగ్‌

జైల్లో తనను ఎంతో వేధించారని అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. అయినా, ఆప్‌ను నాశనం చేయలేరని.. వారి ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని అన్నారు. జైల్లో ఉండే దిల్లీ పాలన బాధ్యతను నిర్వర్తించేందుకు వీలుగా అవకాశం కల్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేస్తానని కేజ్రీవాల్‌ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన సీఎం.. జూన్‌ 2న తిరిగి జైలుకు వెళ్లనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని