Mamata Banerjee: కేజ్రీవాల్‌ అరెస్టును ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తాం: మమతా బెనర్జీ

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భాజపాపై విరుచుకుపడ్డారు. 

Updated : 22 Mar 2024 17:12 IST

కోల్‌కతా: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)ను అరెస్ట్ చేయడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) భాజపాపై విరుచుకుపడ్డారు.  దీనిని ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం చేయిస్తున్న ఈ చర్యలను ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

‘ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులను లక్ష్యంగా చేసుకుని అరెస్టు చేయడం దారుణం. ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి. భాజపాతో సంబంధాలు ఉన్నవారు ఎన్ని అక్రమాలు చేసినా వారికి శిక్ష పడదు. సీబీఐ, ఈడీ దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులైనా భాజపాతో జత కడితే వారిపై ఏ కేసూ ఉండదు’ అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్‌ను నిన్న సాయంత్రం అరెస్టు చేశారు. అరెస్టయిన కొద్ది నిమిషాలకే కేంద్రాన్ని, భాజపాను విమర్శిస్తూ కీలక ప్రతిపక్ష నేతలు సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా తమ వ్యతిరేకతను తెలిపారు. ఎన్నికల సమయంలో దిల్లీ ముఖ్యమంత్రి  కేజ్రీవాల్‌ను ఇలా టార్గెట్ చేయడం తప్పు, రాజ్యాంగ విరుద్ధం. ఈవిధంగా రాజకీయాల స్థాయిని తగ్గించడం ప్రధానమంత్రికి సరికాదు అని ప్రియాంక గాంధీ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ అరెస్టుతో భాజపా అధికారం కోసం ఎంతవరకైనా దిగజారుతుందన్నది తెలుస్తోంది అని శరద్ పవార్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థల దుర్వినియోగంపై భారత కూటమి భాజపాకు తగిన సమాధానం చెబుతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.

మీడియాతో సహా అన్ని సంస్థలను కబ్జా చేయడం, పార్టీలను చీల్చడం, కంపెనీల నుంచి డబ్బులు దండుకోవడం, ప్రధాన ప్రతిపక్షం ఖాతాలను స్తంభింపజేయడం వంటివి చేయడమే కాక, ఇప్పుడు ముఖ్యమంత్రుల అరెస్టు కూడా సర్వసాధారణమైపోయింది అని రాహుల్‌ గాంధీ అన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ స్పందిస్తూ ప్రతిపక్ష నాయకులను భాజపా కనికరం లేకుండా హింసిస్తుంది. ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొనేందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తొమ్మిదోసారి విచారణకు సమన్లను దాటవేయడంతో ఈడీ ఆయనను అరెస్టు చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టులోనూ ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతిలో ఉన్నందున  ఇందులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని