Kerala : మా రాష్ట్రం పేరు కేరళ కాదు.. ‘కేరళం’ అని మార్చండి!

కేరళ (Kerala) పేరును ‘కేరళం’గా (Keralam) మార్చాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో (assembly) తీర్మానం చేశారు. రాజ్యాంగంలోనూ (Constitution of India) కొత్త పేరును చేర్చాలని సీఎం పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Published : 09 Aug 2023 15:32 IST

తిరువనంతపురం : కేరళ (Kerala) పేరును ‘కేరళం’గా (Keralam) మార్చాలనే తీర్మానాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించారు. కొత్త పేరును అధికారికంగా మార్పుచేయాలని ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించనున్నారు. పేరు మార్పునకు సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ పేరును అన్ని భాషల్లో కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లోనూ అందుకు అనుగుణంగా మార్పు చేయాలని సూచించారు. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఆమోదించింది. అందులో ఎలాంటి సవరణ, మార్పులు చేయాలని విపక్షాలు సూచించలేదు. అనంతరం స్పీకర్‌ ఏ.ఎన్. షంషీర్‌ ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. 

ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు మార్చుతారా? కేంద్రం ఏం చెప్పిందంటే..!

సభలో తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో సీఎం పినరయి మాట్లాడుతూ.. రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో ‘కేరళం’ అని పిలిచేవారని గుర్తు చేశారు. కానీ, ఇతర భాషల్లో  మాత్రం కేరళ అని పిలుస్తున్నారని ఆయన చెప్పారు. మలయాళం మాట్లాడే ప్రజల కోసం ఐక్య కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ స్వాతంత్ర్య పోరాట కాలం నుంచే ఉందని వివరించారు. ‘రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో మా రాష్ట్రం పేరును కేరళ అని రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం దానిని ‘కేరళం’గా సవరించాలి. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లో తక్షణమే మార్పులు చేయాలి. రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తోందని’ సీఎం విజయన్‌ అన్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని