Kerala: అన్ని పోలీసు జిల్లాల్లో డ్రోన్‌ నిఘా వ్యవస్థ.. అమలు చేసిన తొలి రాష్ట్రం కేరళ

దేశంలోనే తొలిసారిగా కేరళలోని అన్ని పోలీసు జిల్లాల్లో డ్రోన్‌ నిఘా వ్యవస్థను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రారంభించారు.

Published : 11 May 2023 15:39 IST

తిరువనంతపురం: దేశంలోనే తొలిసారిగా కేరళలోని అన్ని పోలీసు జిల్లాల్లో డ్రోన్‌ (drone) నిఘా వ్యవస్థను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 20 పోలీసు జిల్లాలకు ఒక్కో డ్రోన్‌ను అందించారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రోన్‌ పైలెట్‌లకు లైసెన్స్‌లు పంపిణీ చేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్‌ (anti-drone) సాఫ్ట్‌వేర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పోలీసు బలగాల ఆధునీకరణలో కేరళ ముందంజలో ఉందన్నారు. నేటి సమాజంలో డ్రోన్ల వినియోగం పెరిగినందున యాంటీ డ్రోన్‌ వ్యవస్థను అభివృద్ధి చేయడం ముఖ్యమన్నారు. శిక్షణ పొందిన డ్రోన్ పైలట్‌లు తాము నేర్చుకున్న వాటిని తమ సహోద్యోగులకు కూడా నేర్పించాలని సూచించారు. డ్రోన్‌ ఆపరేషన్‌పై ప్రత్యేక శిక్షణ కోసం 25 మంది పోలీసు సిబ్బందిని మద్రాసులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీకి పంపారు. మరో 20 మందికి కేరళలోని డ్రోన్ ల్యాబ్‌లో ప్రాథమిక శిక్షణ ఇచ్చారు.

శాంతి భద్రతల పరిరక్షణ కోసం, విపత్తు నిర్వహణ సమయంలో ఈ డ్రోన్‌లను వినియోగిస్తామని సైబర్‌డోమ్ నోడల్ అధికారి, ఐజీ ప్రకాష్ తెలిపారు. ‘‘క్లిష్ట పరిస్థితుల్లోనే పోలీసు డ్రోన్లను ఉపయోగిస్తాం కాబట్టి మా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి. కొన్నిసార్లు సాధారణ డ్రోన్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ వీటిని వినియోగిస్తాం. రాష్ట్ర స్థాయిలో డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్, యాంటీ డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేసిన మొదటి రాష్ట్రం కేరళ. డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ హానికరమైన డ్రోన్‌లను గుర్తించగలదు. వివరణాత్మక విశ్లేషణ కోసం వాటి నుంచి పూర్తి డేటాను తిరిగి పొందగలదు. అదే విధంగా, యాంటీ-డ్రోన్ వ్యవస్థ 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇతర డ్రోన్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోగలదు. ప్రత్యర్థి డ్రోన్లను ఇది నాశనం చేయగలదు’’ అని ప్రకాష్‌ వెల్లడించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని