కేరళలో అలాంటివేం జరగవ్‌.. డీకేఎస్‌ ‘శత్రు భైరవి యాగం’ వ్యాఖ్యలపై కేరళ మంత్రి!

కర్ణాటకకు చెందిన కొందరు రాజకీయ నేతలు తమ ప్రభుత్వంపైన, తనపైన కుట్ర పన్ని కేరళలో తాంత్రిక పూజలు చేస్తున్నాంటూ డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలపై కేరళ మంత్రి బిందు స్పందించారు.

Published : 31 May 2024 15:31 IST

తిరువనంతపురం: తమ ప్రభుత్వంపైన, సీఎం సహా తనపైనా కొందరు తాంత్రిక పూజలు చేస్తున్నారంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీటిని కేరళ మంత్రి  డా. ఆర్‌.బిందు తోసిపుచ్చారు. తమ రాష్ట్రంలో అలాంటి కార్యకలాపాలేమీ జరగవన్నారు. కేరళలోని రాజరాజేశ్వరి ఆలయంలో శత్రువుల్ని తొలగించేందుకు కర్ణాటకకు చెందిన కొందరు రాజకీయ నేతలు అఘోరాల నేతృత్వంలో ‘శత్రు భైరవీ యాగం’ పేరిట పూజలు చేస్తున్నారని డీకే శివకుమార్‌ గురువారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.  

సీఎం సహా నాకు వ్యతిరేకంగా ‘యాగం’ - డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు

తమ ప్రభుత్వం, సీఎం సిద్ధరామయ్యతో పాటు తనను టార్గెట్‌ చేసుకొని పంచబలి కోసం దున్నలు, గొర్రెలు, పందులు వంటివి బలిచ్చారని, పూజలు ఇంకా కొనసాగుతున్నాయంటూ డీకేఎస్‌ ఆరోపించారు. వీటిపై శుక్రవారం స్పందించిన మంత్రి బిందు.. దేశంలో కొన్నిచోట్ల సమాజాన్ని చీకటియుగంలోకి నెట్టే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. తమ రాష్ట్రంలో అలాంటివాటికి తావు లేదన్నారు. అయినా, డీకేఎస్‌ ఆరోపణల నేపథ్యంలో కేరళలో ఎక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయేమో పరిశీలిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని