Congress: ‘మా దగ్గర డబ్బు లేదు’: లోక్‌సభ ఎన్నికల వేళ ఖర్గే వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నిధుల కొరతతో ఇబ్బంది పడుతోందని వెల్లడించారు. 

Updated : 14 Mar 2024 10:47 IST

దిల్లీ: తమ దగ్గర డబ్బు లేదని, తీవ్రస్థాయిలో నిధుల కొరతను ఎదుర్కొంటున్నామని కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ బ్యాంకు ఖాతాలను భాజపా నేతృత్వంలోని ఎన్డీయే స్తంభింపజేసిందని ఆరోపించారు. ఆ ఖాతాల్లో ప్రజలు విరాళంగా ఇచ్చిన సొమ్ము ఉందని వెల్లడించారు.

సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోం: అమిత్ షా

‘అదంతా మీరు విరాళంగా ఇచ్చిన పార్టీ సొమ్ము. వారు దానిని ఫ్రీజ్‌ చేశారు. ఇప్పుడు ఖర్చు పెట్టడానికి డబ్బులేదు. వారు(భాజపా) మాత్రం ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన దాతల వివరాలు బయటపెట్టడానికి వెనకాడుతున్నారు’ అని భాజపాపై ఖర్గే (Mallikarjun Kharge) విమర్శలు చేశారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా కలిసికట్టుగా రావాలని, కాంగ్రెస్‌ను గెలిపించాలని కార్యకర్తలను కోరారు.

రూ.100 కోట్ల ఆదాయపు పన్ను బకాయి వివాదంలో కాంగ్రెస్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వసూలుకు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసుపై స్టే విధించడానికి ఆదాయపు పన్ను అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (ఐటీఏటీ) నిరాకరించింది. దానిలో జోక్యం చేసుకునేందుకు దిల్లీ హైకోర్టు కూడా అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఖర్గే స్పందన వచ్చింది.

2018-19 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నుల విషయంలో ఆదాయపు పన్ను విభాగం గతంలో కాంగ్రెస్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. వీటికి పార్టీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో చర్యలు చేపట్టిన ఐటీ విభాగం.. పన్ను రికవరీ నిమిత్తం ఇటీవల పార్టీకి నోటీసులు జారీ చేసింది. ఆ మదింపు సంవత్సరానికి పార్టీ చెల్లించాల్సిన వాస్తవ పన్ను డిమాండ్‌ రూ.102 కోట్లు కాగా.. వడ్డీతో కలిపి అది రూ.135.6 కోట్లకు పెరిగింది. ఇందులో రూ.65.94 కోట్లను ఇటీవల ఐటీ అధికారులు రికవరీ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమ అకౌంట్లపై ఐటీ విభాగం ఎలాంటి చర్యలు చేపట్టకుండా నోటీసులపై స్టే విధించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆదాయపు పన్ను అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌, ఆ తర్వాత దిల్లీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని