CAA: సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోం: అమిత్ షా

CAA: పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. దీనిపై ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే అసత్య రాజకీయాలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు.

Updated : 14 Mar 2024 10:37 IST

దిల్లీ: ఆశ్రయం కోరి వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించడమనేది మన సార్వభౌమ నిర్ణయమని, దానిపై రాజీపడేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పునరుద్ఘాటించారు. ఇందుకోసం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) ఎన్నటికీ వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. సీఏఏపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న వేళ.. ఆయన ఓ జాతీయ మీడియా సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

‘‘రాజ్యాంగం ప్రకారం ఏ దేశ ముస్లింలైనా భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లలో పీడనకు గురైన ముస్లిమేతర మైనారిటీల కోసం ఉద్దేశించినది. ముస్లింలు ఈ దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేయకుండా ఈ చట్టం నిషేధించదు. దీని గురించి నేను చాలా వేదికలపై మాట్లాడాను. ఏ పౌరుడి హక్కులను ఈ చట్టం తొలగించదు. అందువల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు’’ అని అమిత్ షా వెల్లడించారు.

ఇది మోదీ సర్కారు తెచ్చిన చట్టం..

సీఏఏపై ఆందోళనలు ఉద్ధృతమైతే చట్టం అమలుపై పునరాలోచనలు చేస్తారా? అన్న ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘‘దీన్ని ఎన్నటికీ వెనక్కి తీసుకోబోం. తాము అధికారంలోకి వస్తే చట్టాన్ని ఉపసంహరిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. కానీ, వారు ఎన్నటికీ అధికారంలోకి రాలేరని ఇండియా కూటమికి కూడా తెలుసు. ఈ చట్టాన్ని మోదీ సర్కారు తీసుకొచ్చింది. దీన్ని రద్దు చేయడం అసాధ్యం. దీనిపై మేం దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తాం’’ అని స్పష్టం చేశారు.

రాహుల్‌కు షా సవాల్‌..

ఈ సందర్భంగా సీఏఏను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై హోంమంత్రి విరుచుకుపడ్డారు. ‘‘ఈ చట్టంతో భాజపా కొత్త ఓటు బ్యాంకు సృష్టించుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారికి ఏం పనిలేదు. వాళ్లు చెప్పింది ఎన్నడూ చేయరు. నాడు ఆర్టికల్‌ 370 రద్దును కూడా వారు ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ఒవైసీ, రాహుల్‌ గాంధీ, కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ లాంటి వాళ్లు అసత్య రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల కోసం సీఏఏను ఇప్పుడు అమలు చేయలేదు. 2019లోనే దీన్ని పార్లమెంట్‌లో ఆమోదించాం. కానీ కొవిడ్‌, ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. సీఏఏను ఎందుకు వద్దంటున్నారో రాహుల్‌ గాంధీ బహిరంగంగా చెప్పాలి. మీ వ్యాఖ్యలను రుజువు చేసుకునే బాధ్యత మీదే. ఈ చట్టాన్ని ఎందుకు తెచ్చామో మేం స్పష్టంగా చెప్పాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మీరూ వివరణ ఇవ్వండి’’ అని అమిత్ షా సవాల్‌ చేశారు.

సీఏఏపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలనూ కేంద్రమంత్రి దుయ్యబట్టారు. ‘‘అవినీతి బయటపడిన తర్వాత ఆయన సహనం కోల్పోయారు. వలసలపై అంత ఆందోళన ఉంటే.. బంగ్లాదేశీ చొరబాట్లు, రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడలేదు?విభజన రోజులను ఆయన మర్చిపోయినట్లున్నారు’’ అని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్‌లో త్వరలోనే భాజపా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు అక్రమ చొరబాట్లను అడ్డుకుంటామని అన్నారు.

చట్టం అమలు కేంద్రం అంశం..

సీఏఏను తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాలు చేసిన వ్యాఖ్యలను షా తప్పుబట్టారు. ‘‘ఇది కేంద్రానికి సంబంధించిన అంశం. రాష్ట్రాలది కాదు. ఎన్నికల తర్వాత అందరూ దీనికి సహకరిస్తే మంచిది. బుజ్జగింపు రాజకీయాల కోసం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దు’’ అని షా గట్టిగా చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని