Mallikarjun Kharge: మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ (Modi) తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై తాజాగా మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. 

Published : 25 Apr 2024 18:27 IST

దిల్లీ: సంపద పునఃపంపిణీ, మంగళసూత్రం, వారసత్వ పన్ను.. తన ప్రసంగాల్లో ఈ పదాలను ఉపయోగించి ప్రధాని మోదీ (Modi) కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై హస్తం పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈ సమయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) .. మోదీకి లేఖ రాశారు. చప్పట్లకు మోసపోకండంటూ సూచనలు చేశారు.

‘ఇటీవల సభల్లో మీ (మోదీ) భాష విని నేనేమీ ఆశ్చర్యపోలేదు. మీ ప్రసంగాలకు మీ సొంత వ్యక్తులు కొట్టే చప్పట్లు చూసి, మోసపోకండి. మీ మాటలతో నిరాశకు గురైన కోట్లాది మంది ప్రజల అభిప్రాయాలను మీ దరి చేరనివ్వడం లేదు. మా మేనిఫెస్టోలో చేర్చని అంశాల గురించి మీ సలహాదారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మా న్యాయపత్రాన్ని వివరించేందుకు మీతో వ్యక్తిగత భేటీ అయితే ఎంతో సంతోషిస్తాను. ఆ తర్వాత ఒక దేశ ప్రధానిగా మీరు అలాంటి తప్పుడు ప్రకటనలు చేయరు. మీ సూట్‌-బూట్‌ సర్కార్ కార్పొరేట్ రంగంలోని వ్యక్తుల కోసం పనిచేస్తోంది. వారి పన్నులు తగ్గించారు. వారు రీఫండ్స్ పొందుతున్నారు. మరోవైపు ఉద్యోగులు అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నారు. ఆహారం, ఉప్పుపై కూడా పేదలు జీఎస్టీ చెల్లిస్తున్నారు. అందుకే మేం పేద-ధనిక వర్గాల గురించి మట్లాడుతుంటే.. మీరు వెంటనే హిందూముస్లింల ప్రస్తావన తెస్తున్నారు’’ అంటూ లేఖలో తీవ్రంగా స్పందించారు.

మోదీ, రాహుల్‌ వ్యాఖ్యలు.. కోడ్‌ ఉల్లంఘనపై ఈసీ నోటీసులు

‘‘ప్రస్తుతం మీరు మంగళసూత్రం గురించి మాట్లాడుతున్నారు. మణిపుర్‌లో మహిళలపై అకృత్యాలకు మీ ప్రభుత్వం కారణం కాదా..? రేపిస్టులకు పూలదండలు వేయలేదా..? మీ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మీరు వారి భార్యాపిల్లల్ని ఎలా రక్షిస్తున్నారు..? కాంగ్రెస్ మేనిఫెస్టోను చదవండి’’ అని అన్నారు. తన ప్రసంగాల ద్వారా వర్గాల మధ్య విభజన సృష్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజస్థాన్‌లోని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీని విమర్శిస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను మైనార్టీలకు పంచి పెడుతుందని, మహిళల మంగళసూత్రాలను వదిలిపెట్టదని ప్రధాని దుయ్యబట్టారు. అలాగే కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వారసత్వ పన్ను వ్యాఖ్యను ఉద్దేశించి.. ‘చనిపోయాక కూడా మిమ్మల్ని కాంగ్రెస్‌ దోచుకుంటుంది’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఖర్గే స్పందన వచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని