icon icon icon
icon icon icon

Election Commission: మోదీ, రాహుల్‌ వ్యాఖ్యలు.. కోడ్‌ ఉల్లంఘనపై ఈసీ నోటీసులు

Election Commission: ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై వచ్చిన కోడ్‌ ఉల్లంఘన ఆరోపణలపై ఈసీ చర్యలు చేపట్టింది. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు నోటీసులు జారీ చేసింది.

Updated : 25 Apr 2024 14:02 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ (PM Modi), కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వీరిపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission:).. కోడ్‌ ఉల్లంఘన కింద భాజపా (BJP), కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది.

ఇటీవల రాజస్థాన్‌లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఇదే సమయంలో రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే వ్యాఖ్యలపై భాజపా కూడా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ ఫిర్యాదులను స్వీకరించిన ఈసీ తొలిసారి ఉల్లంఘనగా భావించి భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధినేత మల్లికార్జున్‌ ఖర్గేకు నోటీసులిచ్చింది.  ఏప్రిల్‌ 29 ఉదయం 11 గంటల్లోగా ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ నోటీసుల్లో ఎక్కడా మోదీ, రాహుల్‌, ఖర్గే పేర్లను ఈసీ నేరుగా ప్రస్తావించలేదు. ఇదే సమయంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. ‘‘అభ్యర్థులు, ముఖ్యంగా స్టార్‌ క్యాంపెయినర్ల ప్రవర్తనకు రాజకీయ పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి విద్వేష ప్రసంగాలు చేస్తే అవి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి’’ అని గుర్తుచేసింది.

నామినేషన్లకు ముందు.. అయోధ్యకు రాహుల్‌, ప్రియాంక గాంధీ?

రాజస్థాన్‌లోని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీని విమర్శిస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను మైనార్టీలకు పంచి పెడుతుందని, మహిళల మంగళసూత్రాలను వదిలిపెట్టదని ప్రధాని దుయ్యబట్టారు. దీనిపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది.

ఇక రాహుల్ గాంధీ తన ప్రసంగాలతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారని, పేదరికంపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భాజపా దుయ్యబట్టింది. దళితుడిననే కారణంతో తనను అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించలేదంటూ ఖర్గే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని కమలం పార్టీ వీరిద్దరిపై ఫిర్యాదులు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img