West Bengal: ముస్లింల ఓబీసీ హోదా రద్దు

పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం ఉప కులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2010 తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉప కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని పేర్కొంది.

Published : 23 May 2024 05:43 IST

పశ్చిమబెంగాల్‌లో 77 ఉప కులాలకు కల్పించిన వెసులుబాటు చట్ట విరుద్ధం
కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
వాటిని ఓటు బ్యాంకుగా పరిగణించారని వ్యాఖ్య
తీర్పును ఆమోదించేది లేదన్న ముఖ్యమంత్రి మమత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం ఉప కులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2010 తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉప కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని పేర్కొంది. ఈ కులాలను ఓబీసీలుగా ప్రకటించడానికి మతాన్ని ఏకైక ప్రామాణికంగా పరిగణించారని వ్యాఖ్యానించింది. 77 తరగతుల ముస్లింలను వెనుకబడిన వర్గాలుగా ఎంపికచేయడం మొత్తం ముస్లిం సమాజాన్ని అవమానించడమేనని స్పష్టం చేసింది. ‘ఈ సమాజాన్ని (ముస్లింలు) రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వస్తువుగా పరిగణిస్తున్నారు’ అని జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి, జస్టిస్‌ రాజశేఖర్‌ మంథా ధర్మాసనం తెలిపింది. 2012లో చేసిన ఒక చట్టం కింద కొన్ని కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2010 తరవాత ఓబీసీలుగా వర్గీకరణ పొందినవారు 5 లక్షల వరకు ఉంటారని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. అయితే, ఇప్పటికే ఈ విధమైన రిజర్వేషన్లు పొందినవారు, ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసులకు ఎంపికైనవారికి తమ తీర్పు వర్తించదనీ.. వారు ఉద్యోగాల్లో యథావిధిగా కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 2010 ఏప్రిల్‌ - సెప్టెంబరు మధ్య 77 కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను, 2012 చట్టం ఆధారంగా కొత్తగా చేర్చిన మరో 37 కులాల ఓబీసీ హోదాను కోర్టు కొట్టివేసింది. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో 2011 మే వరకు సీపీఎం ప్రభుత్వం ఉండగా, ఆ తర్వాత టీఎంసీ అధికారంలోకి వచ్చింది. 2010కి ముందు రాష్ట్ర ప్రభుత్వం 66 కులాలను ఓబీసీలుగా వర్గీకరించడాన్ని ఎవరూ సవాలు చేయనందున అందులో తాము జోక్యం చేసుకోవడం లేదని కోర్టు తెలిపింది. ఓబీసీల రిజర్వేషను శాతాన్ని 7 నుంచి 17 శాతానికి పెంచుతూ 2010 సెప్టెంబరులో జారీ చేసిన ఉత్తర్వులను సైతం ధర్మాసనం కొట్టివేసింది. ఈ తీర్పుపై స్టే కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్ర ఓబీసీ జాబితాను సమీక్షించి చేరికలు, తొలగింపులపై సిఫార్సులతో శాసనసభకు నివేదిక ఇవ్వాలని.. బీసీ కమిషన్‌తోనూ సంప్రదింపులు జరపాలని పశ్చిమబెంగాల్‌ బీసీ సంక్షేమ విభాగానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.    

సుప్రీంకోర్టుకు వెళతాం: మమత

పలు కులాల ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాము ఆమోదించేది లేదని, సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఒక ఎన్నికల ర్యాలీలో ప్రకటించారు. ఎన్నికల తరుణంలో ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోడానికి భాజపా కుట్ర పన్నిందని ఆరోపించారు.  

ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ

దిల్లీ: కలకత్తా హైకోర్టు 77 ముస్లిం ఉపకులాల ఓబీసీ హోదాను రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దిల్లీ ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ.. ‘‘ముస్లిం అనే పదాన్ని నేను వాడినప్పుడల్లా మతపరమైన ప్రకటనలు చేస్తున్నానని ఆరోపించారు. వాస్తవాలు ప్రజల ముందుంచడం ద్వారా విపక్షాల ఓటుబ్యాంకు రాజకీయాలను బహిర్గతం చేయడమే నేను చేసిన పని’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని