Supreme Court: బ్యాడ్మింటన్‌ ఆడుతున్న లాలూకు బెయిల్ ఎందుకు?: సీబీఐ

లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఝర్ఖండ్‌ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.

Updated : 25 Aug 2023 16:22 IST

దిల్లీ: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు (Lalu Prasad Yadav) మంజూరైన బెయిల్‌ను సవాల్‌ చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) విచారణ చేపట్టింది. లాలూ తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ (Kapil Sibal) వాదనలు వినిపించారు. ఆయన ఇటీవలే కిడ్నీ మార్పిడి చేయించుకున్నారని, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని తిరిగి జైల్లోకి పంపేందుకు సీబీఐ కుట్ర చేస్తోందని వాదించారు. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ ఇటీవల లాలూ బ్యాడ్మింటన్‌ ఆడిన వీడియోలు వైరల్‌ అయ్యాయని, ఒక వేళ ఆయన అనారోగ్యంతో ఉంటే బ్యాడ్మింటన్‌ ఎలా ఆడుతారని ప్రశ్నించారు. అంతేకాకుండా పలు రాజకీయ కార్యక్రమాలకు కూడా ఆయన హాజరైన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న ధర్మాసనం దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా లాలూ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 17కి వాయిదా వేసింది.

దాణా కుంభకోణానికి సంబంధించిన పలు కేసుల్లో జైలు శిక్ష పడిన లాలూ ప్రస్తుతం బెయిల్‌పై బయటే ఉన్న విషయం తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా ఝార్ఖండ్‌ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన లాలూ గతేడాది డిసెంబరులో సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆయన కుమార్తె రోహిణి తండ్రికి కిడ్నీ దానం చేశారు. ఆ ఆపరేషన్‌ తర్వాత లాలూ కోలుకున్నారు. ఇటీవల విపక్షాల ఉమ్మడి కూటమి సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన బెయిల్‌ను సవాల్‌ చేస్తూ సీబీఐ (CBI) సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మోదీ-జిన్‌పింగ్‌ సంభాషణపై చైనా రాజకీయం.. తిప్పికొట్టిన భారత్‌

బిహార్‌లో 1996లో దాణా కుంభకోణం వెలుగు చూసింది. మొత్తం రూ.950 కోట్లకు సంబంధించిన ఈ వ్యవహారంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. దుమ్కా, దేవ్‌గఢ్‌, ఛాయ్‌బాసా కోశాగారాల నుంచి అక్రమంగా నగదు ఉపసంహరించారనే ఆరోపణలు వచ్చాయి. 1991 నుంచి 1996 వరకు పలు దఫాల్లో విత్‌డ్రా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు కేసుల్లోనూ ఆయన దోషిగా తేలారు. తొలి నాలుగు కేసుల్లో మొత్తంగా 14 ఏళ్ల జైలు శిక్ష పడగా..  నకిలీ బిల్లులు చూపించి డోరండా ట్రెజరీ నుంచి రూ.139.50 కోట్లు కొల్లగొట్టారన్న చివరి కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ కేసుల్లో మూడేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన లాలూ.. అనారోగ్య కారణాలతో బెయిల్‌పై విడుదలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని