Modi-Jinping: మోదీ-జిన్‌పింగ్‌ సంభాషణపై చైనా రాజకీయం.. తిప్పికొట్టిన భారత్‌

Modi-Jinping: బ్రిక్‌ సమావేశం సందర్భంగా మోదీ, జిన్‌పింగ్‌ కొంతసేపు సంభాషించుకున్నారు. అయితే దిల్లీ అభ్యర్థన మేరకే జిన్‌పింగ్‌ మాట్లాడారని చైనా అసత్య ప్రచారానికి దిగింది.

Updated : 25 Aug 2023 15:52 IST

దిల్లీ: దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్‌ (BRICS) సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi), చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi i Jinping) కొంతసేపు మాట్లాడుకున్నారు. వాస్తవానికి వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చినా అది జరగలేదు. ఈ క్రమంలోనే చర్చల విషయంలో భారత్‌ (India)పై చైనా (China) నోరుపారేసుకుంది. దిల్లీ అభ్యర్థన మేరకే బ్రిక్స్‌ సదస్సులో మోదీ-జిన్‌పింగ్‌ సంభాషించుకున్నట్లు ఆరోపించింది. అయితే, చైనా వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అసలేం జరిగిందంటే..

మోదీ-జిన్‌పింగ్ (Modi-Jinping) సంభాషణపై చైనా విదేశాంగ శాఖ శుక్రవారం మాట్లాడుతూ.. ‘‘భారత్‌ అభ్యర్థన మేరకే బ్రిక్స్‌ (BRICS) సమావేశాల సందర్భంగా అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. మోదీతో ద్వైపాక్షిక అంశాలపై మాట్లాడారు’’ అని తెలిపారు. కాగా.. చైనా ఆరోపణలపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘భారత్‌తో ద్వైపాక్షిక సమావేశం కోసం చైనానే కోరింది. ఆ అభ్యర్థన పెండింగ్‌లో ఉంది. అయితే బ్రిక్స్‌ దేశాల అధినేతల సంయుక్త మీడియా సమావేశం అనంతరం మోదీ, జిన్‌పింగ్‌ అనధికారికంగా మాట్లాడుకున్నారు’’ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.

సరిహద్దుల్లో శాంతి నెలకొల్పుదాం: జిన్‌పింగ్‌కు మోదీ స్పష్టీకరణ

గురువారం బ్రిక్స్‌ సదస్సు వేదిక వద్దకు వెళ్లేటప్పుడూ మోదీ, జిన్‌పింగ్‌ మాట్లాడుకున్నారు. మీడియా సమావేశం పూర్తయిన తర్వాత కూడా వీరిద్దరూ కొంతసేపు క్లుప్తంగా సంభాషించుకున్నారు. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పుదామని, తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని, అప్పుడే రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత ఏడాది నవంబరులో జీ-20 సదస్సు తర్వాత వారిద్దరు మాట్లాడుకోవడం మళ్లీ ఇప్పుడే.

ఇదిలా ఉండగా.. గల్వాన్‌ లోయలో ఘర్షణలు, తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభనతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇటీవల రెండు దేశాల మధ్య 19వ సారి కార్ప్స్‌ కమాండ్‌ స్థాయి చర్చలు జరిగాయి. ఈ భేటీలో అనేక అంశాలపై  ఇరు దేశాల అధికారులు సుదీర్ఘంగా చర్చించారని.. ఇరువైపుల సానుకూల వాతావరణం కనిపించిందని భారత విదేశాంగశాఖ (MEA) వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని