Lava MD: తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్‌ కోసం ‘లావా’ బాస్‌ నిర్వాకం

Lava MD: బెయిల్‌ పొడిగింపు కోసం లావా కంపెనీ మాజీ ఎండీ అతితెలివి ప్రదర్శించారు. తనలాంటి మరో వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి రెడ్‌ హ్యాండెడ్‌గా బుక్కయ్యాడు.

Published : 18 May 2024 16:36 IST

దిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో బెయిల్‌పై ఉన్న ఓ హై ప్రొఫైల్‌ నిందితుడి వైద్య పరీక్షలను పర్యవేక్షించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు ఎయిమ్స్‌ (AIIMS)కు వెళ్లారు. నాలుగు గంటల పాటు ఎదురుచూసినా అతడు కన్పించకపోవడంతో ఇక రాలేదని ధ్రువీకరించుకునేందుకు డాక్టర్‌ ఛాంబర్‌కు వెళ్లారు. అక్కడ నిందితుడికి పరీక్షలు చేస్తున్నామని వైద్యులు చెప్పడంతో ఈడీ అధికారులు షాకయ్యారు. టెస్టుల కోసం ఆ నిందితుడు అచ్చం తనలాంటి మరో వ్యక్తిని పంపించాడని తెలుసుకుని కంగుతిన్నారు. గత గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ ‘లావా’ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మనీలాండరింగ్‌ కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఈడీ గతేడాది అక్టోబరులో ఆ కంపెనీ ఛైర్మన్‌, ఎండీ (Lava MD) హరి ఓం రాయ్‌ సహా కొందరిని అరెస్టు చేసింది. కొంతకాలం పాటు జైల్లో ఉన్న రాయ్‌కి ఈ ఏడాది ఫిబ్రవరిలో దిల్లీ హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది. వైద్య కారణాల కింద మూడు నెలల మధ్యంతర బెయిల్‌ (Bail) మంజూరు చేసింది.

నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్‌ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన

అయితే, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న తనకు బెయిల్‌ పొడిగించాలని కోరుతూ ఇటీవల రాయ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అతడికి ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని ఈడీని ఆదేశించింది. అనంతరం తీర్పును రిజర్వ్‌ చేసింది. దీంతో మే 16న ఎయిమ్స్‌కు రావాలని అధికారులు నిందితుడికి మెయిల్‌ చేశారు.

ఉదయం 9 గంటలకు ఈడీ అధికారులు ఎయిమ్స్‌కు వెళ్లారు. మధ్యాహ్నం వరకు ఎదురుచూసినా రాయ్‌ రాకపోవడంతో కార్డియాలజీ విభాగానికి వెళ్లారు. అక్కడ నిందితుడికి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు వైద్యులు చెప్పడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా రాయ్‌ పేరుతో మరో వ్యక్తి కన్పించాడు. అతడిని ప్రశ్నించగా తన పేరు నావల్‌ కిశోర్‌రామ్‌ అని, ఉచిత ట్రీట్మెంట్ అని చెప్పి తనను ఇక్కడికి పంపించారని చెప్పాడు. దీంతో ఈడీ అధికారులు వెంటనే హైకోర్టుకు వెళ్లి రాయ్‌ మోసాన్ని బయటపెట్టారు. దీంతో అతడి పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసి జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించింది. అనంతరం పోలీసులు నిందితుడిని తిహాడ్‌ జైలుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు