Ponty Chadha: రూ.400 కోట్ల విలువైన అక్రమ ఫామ్‌హౌస్‌ కూల్చివేత..!

ప్రముఖ లిక్కర్‌ వ్యాపారి కుటుంబానికి చెందిన వందల కోట్ల విలువైన ఫామ్‌ హౌస్‌ను అధికారులు కూల్చివేశారు.    

Published : 03 Mar 2024 13:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూపీ లిక్కర్‌ కింగ్‌కు సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన అక్రమ ఫామ్‌హౌస్‌ను అధికారులు కూల్చేశారు. ఈ ఘటన దిల్లీ పరిధిలో చోటు చేసుకొంది. స్థానిక ఛత్రపుర్‌ ప్రాంతంలోని లిక్కర్‌ వ్యాపారి పాంటీ చద్దా (Ponty Chadha) కుటుంబానికి చెందిన ఓ ఫామ్‌ హౌస్‌ ఉంది. దీని విలువ రూ.400 కోట్లు పైమాటే. దిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ సిబ్బంది శుక్రవారం, శనివారం సామగ్రితో తరలివచ్చి దీనిని పూర్తిగా నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇది చద్దా కుమారుడు మన్‌ప్రీత్‌ అలియాస్‌ మాంటీ కబ్జాలో ఉంది. పాంటీ, అతడి చిన్న తమ్ముడు హర్దీప్‌ మధ్య ఇదే ఫామ్‌హౌస్‌లో గొడవ జరిగింది. ఆ సమయంలో హర్దీప్‌ తుపాకీతో కాల్చి అతడిని చంపాడు. తర్వాత చద్దా అంగరక్షకుడు హర్దీప్‌ను కాల్చేశాడు.  

‘‘ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చి వేత కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ లిక్కర్‌ వ్యాపారి పాంటీ చద్దా అలియాస్‌ గురుదీప్‌ సింగ్‌ నిర్మించిన ఫామ్‌హౌస్‌ను కూల్చివేశాం. ఇది దాదాపు ఛత్రపుర్‌లో 10 ఎకరాలకుపైగా భూమిలో విస్తరించి ఉంది. దీని విలువ రూ.400 కోట్లు’’ అని డీడీఏ అధికారులు వెల్లడించారు. శుక్రవారం నాడు ఐదు ఎకరాలను స్వాధీనం చేసుకోగా.. శనివారం ప్రధాన భవనాన్ని కూల్చివేసి మిగిలిన భూమిని ఆధీనంలోకి తీసుకొన్నట్లు తెలిపారు. దీనిలో గార్డెన్‌, ఔట్‌హౌస్‌, ప్రధాన భవనం ఉన్నాయి. మరోవైపు ఈ చర్యలపై చడ్డాకు చెందిన వేవ్‌ గ్రూప్‌ స్పందించలేదు. ఈ సంస్థ ఉత్తర్‌ ప్రదేశ్‌లో లిక్కర్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో ఉంది. 

మా అనుమతి లేకుండా ఇంటర్వ్యూ చేస్తారా.. భారత మీడియాపై చైనా రుసరుస

ఈశాన్య దిల్లీలో జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు  అక్రమ నిర్మాణాలను డీడీఏ అధికారులు కూల్చేశారు. ఈ క్రమంలో ప్రముఖ వాణిజ్య షోరూమ్‌లు నేలమట్టం చేసి.. నాలుగెకరాల భూమిని స్వాధీనం చేసుకొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని