Mahua Moitra: మహువా మొయిత్రాపై ఆరోపణలు.. లోక్‌సభ ముందుకు ఎథిక్స్‌ కమిటీ నివేదిక

Mahua Moitra: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరించాలంటూ ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీంతో సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి.

Updated : 08 Dec 2023 12:46 IST

దిల్లీ: ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై పార్లమెంటు నైతిక విలువల కమిటీ రూపొందించిన నివేదిక లోక్‌సభ (Lok sabha) ముందుకు వచ్చింది. ఈ నివేదికను భాజపా ఎంపీ, ఎథిక్స్‌ కమిటీ (Ethics Committee) ఛైర్మన్‌ విజయ్‌ సోన్కర్‌ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆరోపణల నేపథ్యంలో మహువాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని కమిటీ ఆ నివేదికలో సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

ఈ నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో నినాదాలు చేశాయి. ఎథిక్స్‌ కమిటీ నివేదిక కాపీ తమకు ఇవ్వాలని, దీనిపై ఓటింగ్‌ నిర్వహించడానికి ముందు సభలో చర్చ జరగాలని పట్టుబట్టాయి. స్పీకర్‌ వారించినా విపక్ష సభ్యులు ఆందోళనను విరమించలేదు. దీంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. కాగా.. ఈ నివేదికను సభ ఆమోదించినట్లయితే మహువా మొయిత్రా (Mahua Moitra) లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురవుతారు. దీనిపై లోక్‌సభ నేడే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

బీరువాల నిండా నోట్ల కట్టలే.. రూ.510 కోట్లు స్వాధీనం

మహాభారత యుద్ధాన్ని చూస్తారు: మహువా

అంతకుముందు ఈ నివేదికపై మహువా మెయిత్రా పార్లమెంట్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘దుర్గా మాత వచ్చింది. ఇక చూసుకుందాం. వినాశనం సంభవించినప్పుడు.. తొలుత కనుమరుగయ్యేది వివేకమే. వస్త్రాపహరణాన్ని వాళ్లు మొదలుపెట్టారు. ఇక మహాభారత యుద్ధాన్ని చూస్తారు’’ అంటూ ఆమె భాజపా సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ దర్యాప్తులో భాగంగానే మహువా మొయిత్రాతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబే, న్యాయవాది జై అనంత్‌ దెహద్రాయ్‌ (మహువా మాజీ మిత్రుడు)ను కమిటీ విచారించింది. అనంతరం 500 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది. ఈ నివేదికను నైతిక విలువల కమిటీ ఇటీవల ఆమోదించింది. మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని ఎథిక్స్‌ కమిటీ పేర్కొంది. ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని సిఫార్సు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని