Madras High Court: కోమాలో ఉన్న భర్త ఆస్తిని అమ్మడానికి భార్యకు అనుమతి: మద్రాసు హైకోర్టు ఉత్తర్వు

కోమాలో ఉన్న భర్త ఆస్తి విక్రయించేందుకు భార్యకు హక్కు ఉందని మద్రాసు హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది.

Updated : 30 May 2024 08:50 IST

చెన్నై(ప్యారిస్‌), న్యూస్‌టుడే: కోమాలో ఉన్న భర్త ఆస్తి విక్రయించేందుకు భార్యకు హక్కు ఉందని మద్రాసు హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది. అనారోగ్యంతో బాధపడుతూ కోమాలోకి వెళ్లిన భర్త ఆస్తులకు తనను గార్డియన్‌గా నియమించాలని కోరుతూ చెన్నైకి చెందిన శశికళ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన సింగిల్‌ బెంచ్‌ జడ్జి.. అందుకు చట్టంలో స్థానం లేదని, పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించి సివిల్‌ కోర్టును ఆశ్రయించాలని ఉత్తర్వు ఇచ్చారు. దీనిపై శశికళ అప్పీల్‌కు వెళ్లగా జస్టిస్‌ స్వామినాథన్, జస్టిస్‌ బాలాజీల ధర్మాసనం విచారించింది. చట్టంలో ఏ మార్గం లేకపోయినా ‘సంరక్షకురాలు’ అనేలా కోర్టు ఉత్తర్వులు ఇవ్వొచ్చు అని గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తుచేసింది. భర్త ఆస్తుల నిర్వహణకు భార్యకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను కొట్టివేసింది. శశికళను తన భర్త శివకుమార్‌కు గార్డియన్‌గా నియమించి, రూ.కోటి విలువైన ఆస్తిని విక్రయించేందుకు అనుమతించింది. అందులో రూ.50 లక్షలు శివకుమార్‌పై ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి వచ్చే వడ్డీ ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని