Mahadev బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారం..కస్టడీలో కీలక సూత్రధారి సౌరభ్‌ చంద్రాకర్‌

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్‌ చంద్రాకర్‌ను (Sourabh Chandrakar) దుబాయ్‌ పోలీసులు నిర్బంధించినట్లు సమాచారం.

Updated : 28 Dec 2023 07:32 IST

దిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌కు (Mahadev Betting App) సంబంధించి మనీలాండరింగ్‌ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలక సూత్రధారి, యాప్‌ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్‌ చంద్రాకర్‌ను (Sourabh Chandrakar) దుబాయ్‌ పోలీసులు నిర్బంధించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో మరో ప్రమోటర్‌ రవి ఉప్పల్‌ (Ravi Uppal)ను అక్కడి పోలీసులు ఇటీవలే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)తోపాటు ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు వీరిద్దరిని స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రవి ఉప్పల్‌, సౌరభ్‌ చంద్రాకర్‌ దుబాయ్‌ కేంద్రంగా భారత్‌లో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో వీరు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. దాంతో రంగంలోకి దిగిన ఈడీ.. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న నగరాల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో రూ.వందల కోట్లలో అక్రమ నగదు బయటపడింది. బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వచ్చే మొత్తాన్ని ఆఫ్‌షోర్‌ ఖాతాలకు తరలించేందుకు హవాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు గుర్తించింది.

Betting App Scam: బెట్టింగ్‌ యాప్‌ మాటున స్కామ్‌

ఈ క్రమంలోనే ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్‌ (Interpol) నిందితులపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీచేసింది. దాని ఆధారంగా ఈ యాప్‌ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను దుబాయ్‌ పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకోగా.. మరో ప్రమోటర్‌ సౌరభ్‌ చంద్రాకర్‌ను తాజాగా గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ వ్యవహారంలో క్యాష్‌ కొరియర్‌గా భావిస్తోన్న అసీం దాస్‌, కానిస్టేబుల్‌ భీం యాదవ్‌లను నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు చేశారు. తాజాగా కీలక సూత్రధారుల ఆచూకీ లభించడంతో ఈ కేసులో ఈడీ కొత్తగా మరో (సప్లిమెంటరీ) ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు