Tamannaah: ఐపీఎల్‌ స్ట్రీమింగ్‌ కేసు.. నటి తమన్నాకు సమన్లు

Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్‌ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్‌ పోలీసులు సమన్లు జారీ చేశారు.

Updated : 25 Apr 2024 11:35 IST

ముంబయి: ప్రముఖ నటి తమన్నా (Tamannaah)కు మహారాష్ట్ర సైబర్‌ పోలీసు (Maharashtra Cyber Cell) విభాగం సమన్లు జారీ చేసింది. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను అక్రమంగా ‘ఫెయిర్‌ ప్లే’ యాప్‌లో ప్రదర్శించిన కేసులో ఆమెను ప్రశ్నించేందుకు ఈ నోటీసులిచ్చింది. ఈ నెల 29న సైబర్‌ విభాగం ఎదుట విచారణకు హాజరుకావాలని సూచించింది.

నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఈ యాప్‌లో ప్రసారం చేయడంతో ‘వయాకామ్‌’ మీడియాకు రూ.కోట్ల మేర నష్టం జరిగిందని సైబర్‌ విభాగం వెల్లడించింది. ఇదే కేసులో ఇటీవల మరో నటుడు సంజయ్‌ దత్‌కు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఏప్రిల్‌ 23నే విచారణకు రావాలని ఆదేశించగా.. ఆయన గైర్హాజరయ్యారు. ఆ సమయంలో తాను దేశంలో లేనని, వాంగ్మూలం ఇచ్చేందుకు మరో తేదీ కేటాయించాలని కోరారు.

ఐపీఎల్‌లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్‌మన్‌ గిల్‌

ఈ ‘ఫెయిర్‌ప్లే’ యాప్‌ అనేది మహదేవ్‌ ఆన్‌లైన్ గేమింగ్‌ అండ్‌ బెట్టింగ్‌ అప్లికేషన్‌కు అనుబంధ సంస్థ. ఇందులో ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు ఎలాంటి అధికారిక బ్రాడ్‌కాస్టింగ్‌ హక్కులు లేవు. అయినప్పటికీ గతేడాది నిబంధనలకు విరుద్ధంగా కొన్ని మ్యాచ్‌లను ఈ యాప్‌లో ప్రసారం చేశారు. వాటిని చూడాలంటూ పలువురు బాలీవుడ్‌ నటులు, గాయకులు ప్రచారం చేశారు. ఫలితంగా వయాకామ్‌కు రూ.కోట్లల్లో నష్టం రావడంతో ఆ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో గతంలో బాలీవుడ్‌ గాయకుడు బాద్‌షా, నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెస్‌, సంజయ్‌ దత్‌ మేనేజర్లను సైబర్‌ విభాగం ప్రశ్నించింది.

ఇక, మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ గతేడాది వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ముసుగులో మనీలాండరింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించి దానిపై కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో బాలీవుడ్‌ను కుదిపేసింది. పలువురు నటీనటులకు సమన్లు జారీ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని