Shubman Gill: ఐపీఎల్‌లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్‌మన్‌ గిల్‌

Shubman Gill: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్‌మన్‌ గిల్‌ తెలిపాడు.

Updated : 25 Apr 2024 09:42 IST

దిల్లీ: ఐపీఎల్‌-17 సీజన్‌లో పరుగుల విషయంలో రికార్డుల మోత మోగుతోంది. జట్లు అలవోకగా 200 స్కోరును అధిగమించేస్తున్నాయి. క్రీజులో నిలదొక్కుకున్న బ్యాటర్లు సులువుగా బౌండరీలు బాదేస్తున్నారు. అయితే, దీంట్లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ పాత్ర ఉందని గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అభిప్రాయపడ్డాడు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొనేందుకు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూపంలో బ్యాటర్లకు అదనపు శక్తి లభిస్తోందని వివరించాడు.

బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను దిల్లీ ఓడించిన విషయం తెలిసిందే. పంత్‌ (Rishabh Pant), అక్షర్‌ల మెరుపులతో దిల్లీ 4 వికెట్లకు 224 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తాజా ఐపీఎల్‌ (IPL) సీజన్‌లో 200+ స్కోరు నమోదు కావడం ఇది 12వ సారి. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఉంటాడనే ధైర్యంతోనే బ్యాటర్లు చివరి వరకు విరుచుకుపడుతున్నారని గిల్‌ అభిప్రాయపడ్డాడు. అందుకే భారీ స్కోర్లు నమోదవుతున్నాయని చెప్పాడు. 

దిల్లీ గట్టెక్కింది

‘‘మేం బాగానే ఆడామనుకుంటున్నాను. చివరకు నాలుగు పరుగుల తేడాతో ఓడిపోవడం నిరాశ మిగిల్చింది. ప్రతి ఒక్కరూ తమవంతు ప్రయత్నం చేశారు.. చివరకు వరకు పోరాడాం. ఏ దశలోనూ మేం ఓడిపోతామనుకోలేదు. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేటప్పుడు ప్రణాళికల గురించి మాట్లాడుకోవడం అనవసరం. వెళ్లి పరుగులు సాధించడంపై దృష్టి సారించాలి’’ అని మ్యాచ్‌ అనంతరం గిల్‌ (Shubman Gill) అన్నాడు.

ఆరంభంలో గుజరాత్‌ బౌలర్లు పటిష్ఠంగానే ఆడారు. కానీ, రిషభ్‌ పంత్‌, అక్షర్‌ పటేల్‌ను అడ్డుకోవటంలో విఫలమయ్యారు. వారిద్దరూ కలిసి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కొన్ని ఎక్స్‌ట్రాలు ఇవ్వడం కూడా తాము చేసిన తప్పిదమని గిల్‌ అంగీకరించాడు. అందుకే 200-210 పరుగుల దగ్గర కట్టడి చేయొచ్చనే తమ అంచనా తప్పిందన్నాడు.

మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన దిల్లీ.. పంత్‌ (Rishabh Pant), అక్షర్‌ల మెరుపులతో 4 వికెట్లకు 224 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో గుజరాత్‌ గొప్పగా పోరాడినప్పటికీ.. చివరికి 220/8కి పరిమితమైంది. 9 మ్యాచ్‌ల్లో దిల్లీకిది నాలుగో విజయం కాగా.. అన్ని మ్యాచ్‌లే ఆడిన గుజరాత్‌ అయిదో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. శుభ్‌మన్‌ గిల్‌ (6) ఔట్‌ కావడంతో గుజరాత్‌ పోటీలో ఉంటుందా అనుకున్న సమయంలో సాహా, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సాయి సుదర్శన్‌ చెలరేగి ఆడి జట్టులో ఆశలు రేపారు. తర్వాత వచ్చిన ప్లేయర్లు కూడా ధాటిగా ఆడటంతో గెలుపు ఖాయంగానే కనిపించింది. కానీ, చివరకు కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు