Mamata Banerjee: మోదీజీ.. మీకు గుడి కట్టిస్తా.. డోక్లా ప్రసాదం పెడతా: మమతా బెనర్జీ

భగవంతుడు తనను దేశ ప్రయోజనం కోసం పంపాడని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Updated : 29 May 2024 18:57 IST

కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనను దేవుడే పంపాడంటూ ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. దేవుళ్లు రాజకీయాలు చేసి అల్లర్లను ప్రేరేపించరని దీదీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటుచేసిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న దీదీ మోదీపై ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘దేశ ప్రయోజనం కోసం భగవంతుడు తనను భూలోకానికి పంపారని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన తనను తాను మరో దేవుడిగా భావిస్తున్నారు. కానీ, దేవుళ్లు రాజకీయాలు చేయరు. అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయరు. నిజంగా.. ఆయన తనను దేవుడిగా భావిస్తే నేనొక్క విన్నపం చేసుకుంటున్నా. మోదీజీ.. మీకు ఒక దేవాలయాన్ని నిర్మిస్తా. ప్రసాదంగా డోక్లా (గుజరాత్‌లో ప్రత్యేక వంటకం) పెడతా. నిత్యం పూజలు చేస్తా. దయచేసి మీరు ఆలయంలో కూర్చోండి. దేశాన్ని సమస్యల్లోకి నెట్టే ప్రయత్నాలు మానుకోండి’’ అని దీదీ ఎద్దేవా చేశారు.

1962లో భారత్‌పై చైనా దాడి ‘ఆరోపణలేనట’.. మణిశంకర్‌ అయ్యర్‌ మరో దుమారం

‘‘ఇప్పటివరకు ఎంతోమంది ప్రధానులతో కలిసి పనిచేశా. అందులో అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ కూడా ఉన్నారు. ఆయన అందరితోనూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. కానీ, మోదీ లాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదు. ఆయన అవసరం దేశానికి లేదు’’ అని మమతా వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. ఇటీవల భాజపా నేత సంబిత్‌ పాత్ర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. చాలాచోట్ల ‘పూరీ జగన్నాథుడే మోదీకి పరమభక్తుడు’ అని పొరబాటున వ్యాఖ్యానించారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గమన్నాయి. అనుకోకుండా తప్పు జరిగిందంటూ క్షమాపణలు కోరుతూ.. నోరు జారినందుకు ప్రాయశ్చిత్తంగా ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నట్లు సంబిత్‌ ఆ తర్వాత వివరణ ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని