Manipur: మణిపుర్‌లో హింస.. వివాదాస్పద పేరాను తొలగించిన హైకోర్టు

మణిపుర్‌లో హింసకు కారణమైన వివాదాస్పద పేరాను తొలగిస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. 

Published : 22 Feb 2024 21:08 IST

ఇంఫాల్‌: జాతుల మధ్య వైరం వల్ల గత ఏడాదిగా మణిపుర్‌ (Manipur Violence)లో హింస చెలరేగుతోంది. శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా.. ఏదోఒక ప్రాంతంలో ఘర్షణలు చెలరేగుతున్నాయి. కుకీ, మైతేయ్‌ తెగల మధ్య చోటుచేసుకున్న హింస కారణంగా ఇప్పటివరకు సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈనేపథ్యంలో రెండు తెగల మధ్య వైరానికి కారణమైన పేరాను తొలగిస్తూ మణిపుర్‌ హైకోర్టు బుధవారం కీలక ప్రకటన చేసింది. మైతేయ్‌లకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించాలని గతేడాది మార్చి 27న కేంద్ర గిరిజన శాఖకు కోర్టు ప్రతిపాదన చేసింది.

వారికి రిజర్వేషన్లు ఇవ్వొద్దని నాగా, కుకీ-జోమీ తెగలు డిమాండ్‌ చేశాయి. మైతేయ్‌లకు రిజర్వేషన్లు దక్కితే వారు తమ అటవీ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటుచేసుకోవడంతో పాటు తమకు ఉద్యోగాల వాటా తగ్గిపోతుందనే ఆందోళనను వ్యక్తంచేశాయి. ఈ క్రమంలోనే దీనిపై దాఖలైన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి వివాదాస్పద పేరాను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. 

కుకీ-మైతేయ్‌ విద్వేషం వెనుక..!

గతేడాది మార్చి 27న మణిపుర్‌ హైకోర్టు ఆదేశాల తర్వాత ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి సిఫార్సులు పంపాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. అయితే, దీనిపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలను కేంద్రానికి పంపలేదు. ప్రస్తుతం దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వివాదానికి కారణమైన పేరాను తొలగిస్తున్నట్లు మణిపుర్‌ హైకోర్టు వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని