Manipur: ఏడాదైనా అదే పరిస్థితి.. మణిపుర్‌ను పట్టించుకోండి: ఆరెస్సెస్‌ చీఫ్‌

మణిపుర్ పరిస్థితులపై ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అక్కడ హింసను అరికట్టాలని పేర్కొన్నారు.

Published : 11 Jun 2024 00:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిరిబామ్‌ జిల్లాలో మిలిటెంట్లు ఇటీవల రెండు పోలీస్‌ అవుట్‌ పోస్టులు, ఫారెస్టు బీట్‌ కార్యాలయంతో పాటు స్థానికుల 70 ఇళ్లను తగలబెట్టారు. మరోవైపు.. కాంగ్‌పోక్పి జిల్లాలో సీఎం భద్రత కాన్వాయ్‌పై సాయుధులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే మణిపుర్ పరిస్థితులపై ఆరెస్సెస్‌ (RSS) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ (Mohan Bhagwat) ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలోని పరిస్థితులను పట్టించుకోవాలని, హింసను అరికట్టాలని కోరారు.

మణిపుర్‌ సీఎం సెక్యూరిటీ కాన్వాయ్‌పై కాల్పులు..!

‘‘పదేళ్ల క్రితం మణిపుర్‌లో శాంతియుత పరిస్థితులు ఉండేవి. తుపాకీ సంస్కృతి ముగిసినట్లు అనిపించింది. కానీ, ఒక్కసారిగా హింస చెలరేగింది. ఏడాది గడిచినా శాంతి నెలకొనలేదు. సమాజంలో ఘర్షణలు మంచివి కావు. శాంతిస్థాపన కోసం మణిపుర్‌ ఏడాది కాలంగా ఎదురుచూస్తోంది. అక్కడ హింసను అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులను ప్రభుత్వాలు ప్రాధాన్యంతో పరిష్కరించాలి’’ అని నాగ్‌పుర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగవత్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల వాతావరణం నుంచి బయటపడి.. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని పాలకులకు సూచించారు.

ఆందోళనతో ‘అస్సాం’ బాట..

మరోసారి చోటుచేసుకున్న దాడులతో ఆందోళనకు గురైన మణిపుర్‌ వాసులు.. పొరుగునే ఉన్న అస్సాం బాటపట్టారు. చాలామంది కఛాడ్‌ జిల్లాకు చేరుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 600 మందికిపైగా కఛాడ్‌ జిల్లాలోని లఖిపుర్‌ ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నట్లు స్థానికులు వెల్లడించారు. నాలుగు రోజులుగా జీరీ నది దాటి ఇటువైపు వస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతను పటిష్ఠం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జాతుల మధ్య ఘర్షణలతో గత ఏడాది మణిపుర్‌ అట్టుడికిన విషయం తెలిసిందే. జిరిబామ్‌కు చెందిన ఓ వ్యక్తి హత్య ఘటన ప్రస్తుత ఆందోళనలకు కారణమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు