Marriage: పెళ్లి ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడం..మోసం కాదు : సుప్రీంకోర్టు

వివాహ ప్రతిపాదన మొదలై.. అది కార్యరూపం దాల్చకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.

Published : 28 Feb 2024 16:42 IST

దిల్లీ: ఓ పెళ్లి ప్రతిపాదనకు సంబంధించి కర్ణాటకకు చెందిన వ్యక్తిపై నమోదైన చీటింగ్‌ కేసును భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కొట్టివేసింది. వివాహ ప్రతిపాదన మొదలై.. అది కార్యరూపం దాల్చకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చని అభిప్రాయపడింది. చీటింగ్‌ (Cheating Case) కింద నేరం రుజువు చేయాలంటే.. మోసం చేయాలనే ఉద్దేశం మొదటినుంచీ ఉండాలనే విషయాన్ని ఉన్నత న్యాయస్థానం పదే పదే చెబుతోందని గుర్తుచేసింది.

తనను పెళ్లి చేసుకోకుండా రాజు కృష్ణ షెడ్బాల్కర్‌ అనే వ్యక్తి మోసం చేశాడని పేర్కొంటూ కర్ణాటకకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహం నిశ్చయమైన తర్వాత తామిద్దరం ఫోన్‌లోనూ మాట్లాడుకున్నామని తెలిపింది. కల్యాణమండపం కోసం తన తండ్రి రూ.75వేలు అడ్వాన్స్‌గా ఇచ్చారని.. చివరకు రాజు మరో అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు తెలిసిందని వెల్లడించింది. రాజుతో సహా ఆయన సోదరులు, సోదరి, తల్లి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. సెక్షన్‌ 417 కింద నమోదైన ఈ కేసును విచారించిన కర్ణాటక హైకోర్టు.. కేవలం రాజును దోషిగా తేల్చింది. వివాహ వేదికను బుక్‌ చేయాలని మహిళ తండ్రిని ప్రేరేపించినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పేర్కొంటూ తీర్పు వెలువరించింది.

పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు.. నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవు : సీఎం సిద్ధరామయ్య

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాజుకృష్ణ 2021లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారించిన జస్టిస్‌ సుధాన్షు ధులియా, జస్టిస్‌ ప్రసన్న బీ వరాలేలతో కూడిన సుప్రీం ధర్మాసనం.. గతంలో హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఒక నిర్దిష్ట సందర్భంలో మోసం ఉండవచ్చని.. ఇటువంటి కేసుల్లో నేరాన్ని నిరూపించడానికి విశ్వసనీయ సాక్ష్యాలు ఉండాలని పేర్కొంది.  ఈ కేసులో మహిళను మోసం చేసే ఉద్దేశం ఆ వ్యక్తికి ఉన్నట్లు కనిపించడం లేదని తెలిపింది. అందుకే సెక్షన్‌ 417 కింద దీన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని