పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు.. నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవు : సీఎం సిద్ధరామయ్య

పాకిస్థాన్‌ (Pakistan) అనుకూల నినాదాలు చేసినట్లు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు.

Published : 28 Feb 2024 14:48 IST

బెంగళూరు: కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల (Rajya Sabha elections) ఫలితాలు వెలువడిన సమయంలో కొందరు పాకిస్థాన్‌కు మద్దతుగా నినాదాలు చేయడం కలకలం రేపింది. ఆ వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలని విపక్ష భాజపా పట్టుబట్టింది. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. పాకిస్థాన్‌ (Pakistan) అనుకూల నినాదాలు చేసినట్లు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

‘కేవలం భాజపానే ఆ ఆరోపణలు చేయలేదు. మీడియా కూడా అదే విషయాన్ని చెబుతోంది. వాయిస్‌ రిపోర్టును ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కి పంపించాం. దేశ వ్యతిరేక నినాదాలు చేయడం వాస్తవమని అందులో తేలితే.. ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అటువంటి వారిని విడిచిపెట్టే ప్రశ్నే లేదు’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) పేర్కొన్నారు.

ఆ దారుణాలపై మాట్లాడుతుంటే వణుకువస్తోంది: నిర్మలమ్మ

రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ అభ్యర్థి నాసిర్‌ హుసేన్‌ విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఆ వెంటనే విధానసౌధలో నాసిర్‌ వెనుక ఉన్న ఓ వ్యక్తి పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు చేయడం తీవ్ర కలకలం రేపింది. నాసిర్‌ హుసేన్‌ స్పందిస్తూ.. అలా నినదించిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని, శత్రుదేశానికి అనుకూలంగా నినాదాలు చేయడం సరికాదని పేర్కొంటూ వాటిని ఖండించారు. అధికారులు దర్యాప్తుచేసి, ఆ వ్యక్తిని గుర్తించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని