MEA: రష్యా ఆర్మీ నుంచి భారతీయులందరినీ విడిపిస్తాం.. ‘అభ్యర్థన’ వార్తలు అవాస్తవమన్న విదేశాంగ శాఖ

MEA: రష్యా ఆర్మీ కోసం పనిచేస్తున్న భారతీయులు అక్కడి నుంచి బయటపడేందుకు సాయం కోసం అభ్యర్థిస్తున్నారంటూ తప్పుడు కథనాలు వస్తున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. 

Updated : 26 Feb 2024 12:00 IST

దిల్లీ: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం (Ukraine-Russia War)లో కొంతమంది భారతీయులు (Indians).. మాస్కో సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీరంతా ఇప్పుడు రష్యా నుంచి బయటపడేందుకు సాయం కోరుతున్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది.

‘‘రష్యా సైన్యంతో కలిసి పనిచేస్తున్న భారతీయులు అక్కడి నుంచి బయటపడేందుకు సాయం కోరుతున్నారంటూ కొన్ని కచ్చితత్వం లేని కథనాలు వస్తున్నాయి. మాస్కోలోని భారత ఎంబసీ దృష్టికి వచ్చే అలాంటి ప్రతి కేసు గురించి మేం మాస్కోలోని అధికారులతో చర్చిస్తున్నాం. భారత్‌లో మా మంత్రిత్వ శాఖ దృష్టికి వస్తున్న కేసులను కూడా దిల్లీలోని ఆ దేశ ఎంబసీ వద్దకు తీసుకెళ్తున్నాం. ఫలితంగా ఇప్పటికే కొంత మంది భారతీయులను అక్కడి సైన్యం నుంచి వెనక్కి తీసుకురాగలిగాం. ఈ విషయాన్ని మేం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. రష్యా సైన్యం నుంచి భారతీయులందరినీ వీలైనంత త్వరగా విడుదల చేయించేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఉక్రెయిన్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు!

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఓ భారతీయుడు మరణించినట్లు తాజాగా ఆంగ్లపత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. రష్యా ఆక్రమిత దొనెట్స్క్‌ ప్రాంతంపై ఫిబ్రవరి 21న ఉక్రెయిన్‌ జరిపిన క్షిపణి దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. దీనిపై ఈ యుద్ధంలో చిక్కుకుపోయిన మరో భారతీయుడు మాట్లాడుతూ.. అతడు తుపాకీ కాల్చడాన్ని సాధన చేస్తుండగా ఈ దాడి జరిగిందని తెలిపాడు. తమను రష్యా నుంచి ఎలాగైనా బయటపడేయాలని అతడు అభ్యర్థించినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. వీటిపైనే తాజాగా విదేశాంగ శాఖ స్పందించింది.

ఇదిలా ఉండగా.. కొందరు భారతీయులు అక్కడి సైనికులకు సహాయకులుగా ఉండేందుకు అంగీకరిస్తూ కాంట్రాక్టులపై సంతకాలు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. దీనిపై తాము మాస్కోతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారిని విడుదల చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. భారతీయులు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి దూరంగా ఉండాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని