CAA: ‘మీ ఉపన్యాసాలు మాకు అక్కర్లేదు’: సీఏఏపై అమెరికా వ్యాఖ్యలకు భారత్‌ కౌంటర్

సీఏఏ విషయంలో అమెరికా వ్యాఖ్యలపై భారత్‌ స్పందించింది. సీఏఏ వల్ల కొత్తగా పౌరసత్వం లభిస్తుందని, ఎవరి పౌరసత్వం పోదని స్పష్టమైన సమాధానం ఇచ్చింది.

Updated : 15 Mar 2024 18:22 IST

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు కోసం భారత్‌ (India) ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. దానిపై అగ్రరాజ్యం అమెరికా చేసిన వ్యాఖ్యల(CAA Remarks)కు భారత్‌ దీటుగా స్పందించింది. అవి కల్పితం, అనవసరమని వ్యాఖ్యానించింది.

‘‘సీఏఏ అనేది కొత్తగా పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించినది. ఎవరి నుంచి పౌరసత్వాన్ని లాక్కొనేది కాదు. తనకంటూ ఒక దేశం లేని వ్యక్తి సమస్యను పరిష్కరిస్తుంది. మానవ హక్కులకు మద్దతు ఇస్తుంది. మర్యాదపూర్వకమైన జీవితాన్ని అందిస్తుంది. ఆ చట్టం ఒక దేశ అంతర్గత వ్యవహారం. భారత దేశ సమ్మిళిత సంప్రదాయాలకు, మానవ హక్కుల పరిరక్షణకు అనుగుణంగా ఉంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు సురక్షిత ప్రదేశాన్ని అందిస్తుంది’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు.

‘‘సీఏఏ అమలుకు సంబంధించి అమెరికా చేసిన ప్రకటన కల్పితమని, అనవసరమైందని మేం భావిస్తున్నాం. భారత్‌ బహుళ సంస్కృతులు, విభజన అనంతర చరిత్రపై పరిమిత జ్ఞానం ఉన్నవారు మాకు ఉపన్యాసాలు ఇవ్వొద్దు. మా శ్రేయాభిలాషులు, భాగస్వాములు సీఏఏ ఉద్దేశాన్ని స్వాగతించాలి’’ అని అమెరికా వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చారు.

ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు వీలుగా కేంద్రం సీఏఏ-2019ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సార్వత్రిక ఎన్నికలకు ముందు దీని అమలు విధివిధానాలను పేర్కొంటూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘మార్చి 11న వచ్చిన సీఏఏ నోటిఫికేషన్‌పై మేం ఆందోళన చెందుతున్నాం. దీన్ని ఎలా అమలుచేయనున్నారో నిశితంగా గమనిస్తున్నాం. మత స్వేచ్ఛ, చట్ట ప్రకారం అన్నివర్గాల వారిని సమానంగా చూడడం ప్రజాస్వామ్య మూలసూత్రం’’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే.. ఈ చట్టం వల్ల ముస్లింల పౌరసత్వం పోదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని