Youngest MPs: పాతికేళ్లకే పార్లమెంట్‌కు.. ప్రజాగళం వినిపించనున్న ‘ఆ నలుగురు’!

సీనియర్‌ నేతలకు ఓటమి రుచి చూపి లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి.. పాతికేళ్లకే పార్లమెంట్‌కు ఎన్నికలయ్యారు నలుగురు యువకెరటాలు. 

Published : 06 Jun 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల్లో పలు రాష్ట్రాలకు చెందిన యువ కెరటాలు సత్తా చాటారు. సీనియర్‌ నేతలపై విజయం సాధించి పాతికేళ్ల ప్రాయంలోనే ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రజల తరఫున గళం వినిపించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుత పార్లమెంట్‌లో అతిపిన్న ఎంపీలుగా ఘనత దక్కించుకున్న వీరి నేపథ్యాన్ని పరిశీలిస్తే..

కాంగ్రెస్‌ను సునాయాసంగా ఓడించి.. 

శాంభవి చౌధరి.. బిహార్‌లోని సమస్తిపుర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌ జనశక్తి పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. అటు కాంగ్రెస్‌ కూడా జేడీయూ మంత్రి మహేశ్వర్‌ హజరీ కుమారుడు సన్నీ హజరీని పోటీలో నిలబెట్టింది. అయితే.. ఎన్నికల్లో శాంభవి తన ప్రత్యర్థిని సునాయాసంగా ఓడించారు. విజయాన్ని సొంతం చేసుకున్న ఆమె 25 ఏళ్ల వయసుకే ఎంపీగా ఎన్నికైన వారి జాబితాలో చేరారు. బిహార్‌ మంత్రిగా ఉన్న అశోక్‌ చౌధరి కుమార్తె శాంభవి. ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధాని మోదీ.. శాంభవిపై ప్రశంసలు కురిపించారు.

సత్తా చాటిన కానిస్టేబుల్‌ భార్య.. 

రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ నుంచి సంజనా జాతవ్‌ను కాంగ్రెస్‌ బరిలో నిలిపింది. 51,983 ఓట్ల మెజార్టీతో భాజపా అభ్యర్థి రామ్‌స్వరూప్‌ కోలీపై విజయం సాధించారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సంజన.. భాజపా అభ్యర్థి రమేశ్‌ ఖేడీ చేతిలో కేవలం 409 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా వెనక్కి తగ్గని ఆమె.. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటారు. సంజనా భర్త పోలీసు కానిస్టేబుల్‌ కావడం గమనార్హం.

వయనాడ్‌, రాయ్‌బరేలీ.. రాహుల్‌ ఏది వదులుకుంటారు..?

సిట్టింగ్‌ ఎంపీని ఓడించి.. 

యూపీలోని మచ్లీషహర్‌ భాజపా సిట్టింగ్‌ ఎంపీ భోలానాథ్‌కు పోటీగా సమాజ్‌వాదీ పార్టీ ప్రియా సరోజ్‌ను బరిలోకి దింపింది. ఈమె మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన తూఫానీ సరోజ్‌ కుమార్తె. ఎన్నికల్లో 35,850 ఓట్ల మెజార్టీతో భోలానాథ్‌పై నెగ్గారు. 

భాజపాపై విజయం..

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో నుంచి భాజపాకు పోటీగా పుష్పేంద్ర సరోజ్‌ను సమాజ్‌వాదీ పార్టీ  బరిలోకి దింపింది. 1,03,944 ఓట్ల తేడాతో భాజపా సిట్టింగ్‌ ఎంపీ వినోద్‌ కుమార్ సోంకరను ఓడించి ఆయన ఘన విజయం సాధించారు. ఇప్పటివరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఇంద్రజిత్‌ సరోజ్‌ కుమారుడే ఈ పుష్పేంద్ర.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు