Center: సైనిక స్కూళ్లపై కాంగ్రెస్ ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన కేంద్రం

సైనిక స్కూళ్ల ప్రైవేటీకరణకు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి కాంగ్రెస్‌ (Congress) రాసిన లేఖపై కేంద్రం స్పందించింది.    

Updated : 11 Apr 2024 17:42 IST

దిల్లీ: దేశంలోని సైనిక్‌ స్కూళ్లను ప్రైవేటీకరించే యోచనను కేంద్రం విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు. ప్రైవేటీకరణకు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను రద్దు చేయాలని, ఆ విధానాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనిపై కేంద్రం తీవ్రంగా స్పందించింది.

నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల అటాచ్‌ సబబే

‘‘రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ ద్వారా దేశంలో 33 సైనిక్‌ స్కూళ్లు పనిచేస్తున్నాయి. ఇంతవరకు సైనిక దళాలు, వాటి అనుబంధ సంస్థలు రాజకీయాలకు దూరంగా ఉన్నాయి. ప్రైవేటీకరిస్తే వాటి స్వభావంపై ప్రభావం పడుతుంది. ఒక సిద్ధాంతాన్ని వీటి ద్వారా విద్యార్థులపై రుద్దేందుకు ప్రయత్నించడం తగదు. దేశ సేవకు కావాల్సిన లక్షణాలను, దార్శనికతను ఈ పాఠశాలల్లోని విద్యార్థులు నిలుపుకోవాలంటే ప్రైవేటీకరణ ఒప్పందాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. లేదంటే 62% పాఠశాలల్ని భాజపా-ఆరెస్సెస్‌ నేతలే సొంతం చేసుకోనున్నారు’’ అని ఖర్గే తన లేఖలో తెలిపారు.

ఈ ఆరోపణలను రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ‘‘ఏ రాజకీయ, సైద్ధాంతిక సంస్థలు ఈ ఎంపిక ప్రక్రియను ప్రభావితం చేయవు. దీనికి సంబంధించి వచ్చిన ఆరోపణలు అసంబద్ధమైనవి. తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి’’ అని ఖండించింది. విద్యారంగంలో అనుభవం ఉన్న సంస్థలతో 100 పాఠశాలలను ఏర్పాటు చేసే పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని తెలిపింది. కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా 500 దరఖాస్తులను స్కాన్‌ చేయగా.. 45 పాఠశాలలకు మాత్రమే ఆమోదం లభించిందని పేర్కొంది. అది కూడా తాత్కాలికమేనని, వాటిపై పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని