Kota Student: అదృశ్యమైన కోటా విద్యార్థి.. 23 రోజులు.. దేశమంతా చక్కర్లు కొట్టి!

ఇటీవల రాజస్థాన్‌లోని కోటా నుంచి అదృశ్యమైన ఓ విద్యార్థి.. 23 రోజుల వ్యవధిలో జమ్మూ-కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఆయా ప్రాంతాలన్నీ చుట్టేయడం గమనార్హం.

Published : 01 Jun 2024 00:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజస్థాన్‌లోని కోటా (Kota)లో ‘నీట్‌’ శిక్షణ తీసుకున్న ఓ విద్యార్థి (19) ఇటీవల అదృశ్యమైన విషయం తెలిసిందే. పరీక్ష సరిగ్గా రాయలేదని మనస్తాపం చెంది.. అయిదేళ్ల వరకు తిరిగిరానంటూ తండ్రికి సందేశం పంపి మాయమైన అతడి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. పోలీసులతోపాటు కుటుంబసభ్యులూ బృందాలుగా విడిపోయి గాలించారు. చివరకు గోవాలో కన్నతండ్రే అతడి జాడను గుర్తించాడు. ఈ 23 రోజుల వ్యవధిలో అతడు జమ్మూ-కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఆయా ప్రాంతాలన్నీ చుట్టేయడం గమనార్హం.

పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని బమన్‌వాస్‌ ప్రాంతానికి చెందిన రాజేంద్రప్రసాద్‌ మీనా కోటాలో నీట్‌ శిక్షణ తీసుకున్నాడు. పరీక్ష జరిగిన మరుసటిరోజు (మే 6న).. ‘‘ఉన్నత చదువులు చదవాలని లేదు. నేను వెళ్లిపోతున్నాను. అయిదేళ్ల వరకు తిరిగిరాను. నా గురించి బాధపడొద్దని అమ్మకు చెప్పండి. ఏడాదికి ఒకసారి తప్పకుండా ఫోన్‌ చేస్తాను’’ అని తండ్రికి సందేశం పంపి, అదృశ్యమయ్యాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కోటా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు గాలింపు చేపట్టారు. కుటుంబసభ్యులు కూడా నాలుగు బృందాలుగా విడిపోయి వెతకడం ప్రారంభించారు.

ఐదేళ్ల వరకు రాను: తండ్రికి మెసేజ్‌ పంపి విద్యార్థి అదృశ్యం

మే 6న తన ఫోన్‌ అమ్మేసి, తొలుత పుణె రైలెక్కాడు. అక్కడే రెండు రోజులు ఉన్నాడు. రూ.1500కు సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ కొనుక్కున్నాడు. తన ఆధార్‌ సాయంతో సిమ్‌ కార్డు సంపాదించాడు. అనంతరం అమృత్‌సర్ స్వర్ణదేవాలయం, జమ్మూ వైష్ణోదేవీ ఆలయం, తాజ్‌మహల్‌, ఒడిశా పూరీ జగన్నాథ క్షేత్రం, తమిళనాడులోని రామేశ్వరం, కన్యాకుమారి, కేరళలోని తిరువనంతపురం ఇలా ఆయా ప్రాంతాలు సందర్శించాడు. అటుపై గోవాకు వెళ్లాడు. అప్పటికే సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కుటుంబసభ్యులు అతడి కదలికలను ట్రాక్‌ చేశారు. ఈ క్రమంలోనే మడ్‌గావ్‌ రైల్వేస్టేషన్‌లో తండ్రి అతడిని గుర్తించాడు. మరో రైలు ఎక్కుతుండగా.. తండ్రి పిలుపుతో తెలియకుండానే అతడు స్పందించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రైళ్లలో టికెట్‌ లేకుండా ప్రయాణం..

కోటా నుంచి వెళ్లిపోయే ముందు అతడు పుస్తకాలు, ఫోన్‌, రెండు సైకిళ్లు అమ్మేసి రూ.11 వేలు కూడగట్టాడు. రైళ్లలో చాలావరకు టికెట్‌ లేకుండానే ప్రయాణించాడు. రాజేంద్రను వెతికేందుకు కోటా పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆధార్‌ కార్డు మీద సిమ్‌ తీసుకున్నప్పుడే పుణెలో గుర్తించాల్సిందన్నారు. అయితే.. ఆయా ప్రాంతాలకు కుటుంబసభ్యులతో తమ బృందాలనూ పంపినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిని కుటుంబానికి అప్పగించినట్లు వెల్లడించారు. ఇష్టమైనదే చేయాలని, ఇంట్లోనే ఉండాలని కుటుంబసభ్యులు అతడిని కోరినట్లు చెప్పారు. దేశమంతా చుట్టేసినా.. అతడి వద్ద చివరకు రూ.6 వేలు మిగిలిఉండటం కొసమెరుపు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని